AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ పై(Cabinet Expansion) గత కొద్ది రోజులుగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరింత ఎక్కువయ్యాయి. మంత్రివర్గ ప్రక్షాళన ఖాయమని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు పూర్తవుతోంది. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు మదింపు జరుగుతోంది. పలువురు మంత్రులను హెచ్చరిస్తూ సీఎం ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. అయినా సరే చాలామంది తీరులో మార్పు రావడం లేదు. ఈ తరుణంలో మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటమి వర్గాల్లో మంత్రివర్గ విస్తరణ పై చర్చ సాగుతోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? మరికొంత సమయం వేచి చూస్తారా? అన్న చర్చ కూడా సాగింది. అయితే ఏపీ మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రచారం ప్రారంభం అయ్యింది.
సీఎం హెచ్చరికలు బేఖాతరు
ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన( janasena ) నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అయితే చాలామంది మంత్రుల విషయంలో సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న పదిమంది తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే. అయితే వారి ఎంపిక సమయంలోనే కీలక సూచనలు చేశారు. అత్యవసరం అయితే మంత్రివర్గ విస్తరణ చేపడతామని.. ఆ సమయంలో పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. అందుకే ఇప్పుడు ఎనిమిది మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతారని తాజాగా ప్రచారం ప్రారంభం అయ్యింది.
మెగా బ్రదర్ తో పాటు మరొకరికి..
మరోవైపు మెగా బ్రదర్ నాగబాబును( Mega brother Naga babu ) మంత్రివర్గంలోకి తీసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్. మరోవైపు ఇప్పుడున్న మంత్రి పదవికి తోడు మరో పదవి బిజెపి కి కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవైపు మిత్రపక్షాలకు ప్రాధాన్యం పెంచుతూ.. పార్టీలో సీనియర్లను క్యాబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా ప్రక్షాళన ఉంటుందని సమాచారం. అదే జరిగితే టిడిపిలో సీనియర్లు ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి? బిజెపిలో ఛాన్స్ ఎవరికి అనే చర్చ ప్రారంభం అయింది.
Also Read: జగదీప్ ధంకర్ మరో సత్యపాల్ మాలిక్ గా మారుతాడా?
రఘురామకృష్ణం రాజు ఇన్..
మరోవైపు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును( Raghu Ramakrishnan Raju ) మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే రఘురామ కృష్ణంరాజు స్థానంలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని డిప్యూటీ స్పీకర్ చేస్తారని సమాచారం. జనసేన నుంచి మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ ను తప్పించి కొణతాల రామకృష్ణకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు మంత్రులను తప్పించడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే పల్లా శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, కళా వెంకట్రావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాలకు చెందిన వాసంశెట్టి సుభాష్ ను తప్పించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిని తప్పించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకుంటారని సమాచారం.
మాజీ సీఎం సోదరుడికి అవకాశం..
రాయలసీమ నుంచి సైతం చేర్పులు మార్పులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మంత్రిని తప్పించి ఆ స్థానంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక కృష్ణాజిల్లా నుంచి ఒక మంత్రిపై వేటు వేస్తారని తెలుస్తోంది. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణలకు అనుగుణంగా తుది నిర్ణయాలు జరగనున్నాయి. అన్ని సమీకరణలను ప్రామాణికంగా తీసుకుని చేర్పులు మార్పులు ఉంటాయని సమాచారం. అయితే ఒకేసారి ఎనిమిది మంది మంత్రులను తప్పించడం పెను సంచలనమే.