MLA Kolikapudi Protest: నిజంగా వివాదాల్లో చిక్కుకుంటారో.. లేకుంటే వివాదాలే ఎదురొస్తాయో.. తెలియదు కానీ.. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని ఉంటారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు(kolikapudi srinivasa rao). తాజాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్ సృష్టించారు. వ్యాప్తంగా ఎస్సై పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది వైరల్ అంశంగా మారింది. మరోసారి కొలికపూడి వివాదాల్లో చిక్కుకున్నట్లు అయింది. గత కొద్దిరోజులుగా అనేక వివాదాలు ఆయన చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక అంశంలో ఆయన తలదూర్చుతుంటారు. అదే వివాదంగా మారిపోతూ ఉంటుంది.
నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి..
తిరువూరు(Tiruvuru) ప్రాంతానికి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో చిల్లపల్లి రామకృష్ణ అనే టిడిపి కార్యకర్తపై అదే పార్టీకి చెందిన కందిమల్లు సాయి సుమిత్, పానుగంటి వెంకట్, మరో నలుగురు వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. తప్పించుకునే క్రమంలో రామకృష్ణ సాయి సుమిత్ పై సీసాతో దాడి చేశాడు. సాయి సుమిత్ ఫిర్యాదు మేరకు రామకృష్ణ పై కేసు నమోదయింది. దీంతో తిరువూరు పోలీసులు రామకృష్ణ పై కేసు నమోదు చేశారు. రామకృష్ణను ఆశ్రయించే ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో రామకృష్ణ తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మి లను స్టేషన్కు తీసుకువచ్చారు పోలీసులు. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణ ఇంటి పై దాడికి వచ్చిన సాయి సుమిత్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. దాడికి ప్రయత్నించిన వారిని విడిచిపెట్టి.. ఆత్మ రక్షణ కోసం దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టడం అమానుష చర్యగా అభివర్ణించారు. అలా మాటా మాట పెరిగి ఎస్ఐ సత్యనారాయణ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
Also Read: ప్రక్షాళన.. ఏపీ క్యాబినెట్ నుంచి 8 మంది ఔట్!
స్టేషన్లోనే పంచాయతీలు..
తిరువూరు ఎస్సై సత్యనారాయణ గంజాయి బృందాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు. గంజాయి అమ్మేవారితో పాటు కొనుగోలు చేసినవారిని సైతం భారీగా వసూలుకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. స్టేషన్లోనే ఎస్ఐ ప్రైవేటు పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని.. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే. ఎస్సై సత్యనారాయణ ఒక వ్యక్తిని గంజాయి అమ్ముతున్నాడని స్టేషన్ కు పిలిపించారని.. మరో వ్యక్తి ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఎస్సైకి బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర డబ్బులు ఇచ్చారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కొ లికపూడి శ్రీనివాసరావు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇద్దరు టిడిపి కార్యకర్తల మధ్య దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అందులో ఒకరు ఎమ్మెల్యేకు సన్నిహిత వ్యక్తి అని తేలిపోయింది.