600 new buses in AP : ఏపీఎస్ఆర్టీసీకి ( APSRTC) మరో గుడ్ న్యూస్. వందలాదిగా అదనపు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ కి సమకూరనున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలకు ఈ-బస్ సేవా పథకం కింద 14 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తోంది. ఏపీకి సంబంధించి 11 నగరాలకు 750 బస్సులను కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఏపీఎస్ఆర్టీసీ మాత్రం మరో 600 బస్సులు కావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఈ బస్సులను వివిధ నగరాల్లో నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాలం చెల్లిన బస్సులను తీసేయడం వల్ల అదనంగా 300 బస్సులు, కొత్తగా మరో 300 బస్సులు కావాలని ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. కొత్తగా రానున్న ఈ బస్సులు విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు తో పాటు పలు నగరాల్లో నడపాలని ప్లాన్ చేస్తున్నారు.
* ప్రధాన నగరాల్లో 100 చొప్పున..
ముందుగా కేంద్ర ప్రభుత్వం( central government) మంజూరు చేసే ఈ బస్సులను విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాల్లో 100 చొప్పున నడపనున్నారు. అమరావతి, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు నగరాల్లో 50 చొప్పున బస్సులను నడపనున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు విధానంలో పూణేకి చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్ సంస్థ పర్యవేక్షణ ఉంది. అయితే ఈ బస్సులు ఆర్టీసీ డిపోల్లోనే ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో డిపోల్లో అవసరమైన విద్యుత్ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హై టెన్షన్ విద్యుత్ లైన్ సైతం డిపోలకు అందించనున్నారు. అందుకు సంబంధించి విద్యుత్ ఖర్చు కూడా కేంద్రమే భరించనుంది.
Also Read : అవి నేలపై నడిచే విమానాలు: కొత్త ఆర్టీసీ బస్సుల్లో సౌకర్యాలు తెలిస్తే నోరెళ్ళ బెడతారు
* పూణే సంస్థతో ఒప్పందం
రాష్ట్రవ్యాప్తంగా 750 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు( electric bus) నడిపేందుకు ఆర్టీసీ, కాంట్రాక్టు సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ బస్సుల్లో 124 బస్సులు 9 మీటర్ల పొడవు ఉంటాయి. మిగిలిన బస్సులు మాత్రం 12 మీటర్ల పొడవు ఉంటాయి. వీటి కాలపరిమితి 12 సంవత్సరాలు. పది లక్షల కిలోమీటర్ల వరకు నడిపేందుకు ఒప్పందం కుదిరింది. 12 మీటర్ల బస్సు కు కిలోమీటర్ కు రూ.72.55.. 9 మీటర్ల బస్సుకు కిలోమీటర్ కు రూ. 62.12 ధరను కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నుంచి సబ్సిడీగా కిలోమీటర్ కు 24 రూపాయల వరకు రానుంది. మిగిలిన డబ్బులు మాత్రం ఆర్టిసి చెల్లించనుంది. మరో రెండు నెలల తరువాత ఈ బస్సులు అన్ని నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిగా పర్యావరణహితం. కాలుష్య నియంత్రణకు ఎంతగానో దోహదపడుతాయి. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఒకేసారి 750 ఎలక్ట్రిక్ బస్సులు వస్తుండడం శుభపరిణామం. మరో 600 అదనపు బస్సులు కావాలని ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టుకోవడం విశేషం. మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.