TSRTC New Buses: తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కొత్త బస్సులు కొన్నది.. సరే లేటుగా అయినా కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.. ఎందుకంటే ఆ కాలం చెల్లిన బస్సులతో అటు ఆర్టీసీ సిబ్బంది, ఇటు ప్రయాణికులు నరకం చూస్తున్నారు.. అయితే గతంలో సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీకి కొత్త బస్సులు కొనిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత దానిని నిలబెట్టుకున్నారు.. కేసీఆర్ 392 కోట్ల వ్యయంతో అధునాతనంగా రూపొందించిన 1,016 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది.. వీటిలో మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్ ఇస్తే.. ఇప్పటికే కొన్ని సూపర్ లగ్జరీ బస్సులు తయారై డిపోలకు చేరుకున్నాయి.. మిగతా బస్సులు రాబోయే మార్చిలో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.

ఏమిటి ఆ ప్రత్యేకతలు
ఈ బస్సులను అశోక్ లేలాండ్ అనే సంస్థ తయారు చేసింది.. పూర్తి అధునాతన పరిజ్ఞానంతో రూపొందించింది.. స్లీపర్ బస్సులు అయితే చూసేందుకు చిన్నపాటి విమానాన్ని తలపిస్తున్నాయి.. అందులో హై ఎండ్ టెక్నాలజీ వాడారు.. కొత్తగా తయారుచేసిన సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు.. సరికొత్త ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు ఖర్చులో ఎక్కడ కూడా వెనుకాడ లేదు. పూర్తిగా వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే బస్సుల మాదిరి వీటిని తయారు చేశారు.
ట్రాకింగ్ సిస్టం
కొత్త లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించారు.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టం, పానిక్ బటన్ సదుపాయం కల్పించారు.. వాటిని ఆర్టిసి కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ప్రయాణికులకు బస్సుల్లో ఇబ్బందులు ఎదురైతే పానిక్ బటన్ నొక్కగానే క్షణాల్లో ఆర్టీసీ కంట్రోల్ రూమ్ కు సమాచారం వెళ్తుంది.. ఈ సమాచారం ద్వారా వేగంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారు.. ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రీ క్లైనింగ్ సీట్లు ఉన్నాయి.. ఎల్ఈడి డిస్ప్లే బోర్డులు ఈ బస్సుల్లో ప్రధాన ఆకర్షణ. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. అంతేకాదు ప్రతి బస్సుకు వెనుక రివర్స్ పార్కింగ్ అసిస్టెంట్ కెమెరా కూడా ఉంటుంది.. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది.

అత్యాధునిక ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం వల్ల ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే అది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత ఏమాత్రం పెరిగినా అలారం మోగుతూనే ఉంటుంది.. అగ్ని ప్రమాదాలు జరిగితే ఎస్డిఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు.. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ చార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను కూడా ఏర్పాటు చేశారు.. ముందు భాగంలో డ్రైవర్ వద్ద మైక్ అనౌన్స్మెంట్ సిస్టం, ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి దానిని లోపల అమర్చిన సీసీ కెమెరాలుకు అనుసంధానం చేశారు.. గతంలో ఉన్న సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ సౌకర్యాలు ఉండేవి కావు.. పైగా వాటి కండిషన్ సరిగా లేక ప్రమాదాలు జరిగేవి.. ఈ బస్సులను డ్రైవింగ్ చేసేందుకు కొంతమంది డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. నిన్న ప్రారంభించిన ఈ బస్సుల్లో ప్రయాణం చేసిన వారు సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు.