Andhra Pradesh: సమాజంలో ఉపాధ్యాయులది ప్రత్యేక స్థానం. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేది వారే. పిల్లల్లో జ్ఞానం నింపి ప్రయోజకులుగా చేసేది కూడా వారే. విద్యార్థులు తప్పు చేస్తే ఓ అమ్మలా, నాన్నలా దండించే హక్కు వారికి ఉంది. కానీ అదే విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చెప్పిన మాట వినడం లేదనే కారణంతో విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ అమానుషంగా వ్యవహరించారు. రెండు రోజులపాటు కాలేజీ విద్యార్థులతో గుంజీలు తీయించారు. దీంతో 50 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మాట వినలేదని ఇలా అమానుషంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
* చెప్పిన మాట వినలేదని
రంపచోడవరం గిరిజన గురుకుల కళాశాలలో సుమారు 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో వారందరినీ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే కేవలం చెప్పిన మాట వినడం లేదనే కారణంతోప్రిన్సిపల్ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వరుసగా రెండు రోజులపాటు విద్యార్థినులతో 100 గుంజీలు తీయించడంతో వారంతా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కనీసం నడిచేందుకు కూడా ఇబ్బంది పడటం.. ఇది బయటకు వెలుగులోకి రావడంతోగురుకుల కళాశాల సిబ్బంది స్పందించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
* ప్రిన్సిపల్ తీరుపై విమర్శలు
ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రిన్సిపల్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మాట వినకపోతే దండించడం తప్పులేదు కానీ.. ఇలా కర్కశంగా వ్యవహరించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
* ఎమ్మెల్యే పరామర్శ
మరోవైపు ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి స్పందించారు. బాధిత విద్యార్థినులను పరామర్శించారు. జరిగిన విషయంపై ఆరా తీశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించినట్లు తెలుస్తోంది. శాఖా పరమైన విచారణకు ఆదేశించినట్లు సమాచారం.