Chaganti Koteswara Rao : ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే.పాఠశాల విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు సలహాదారుగా నియమించింది. ఏకంగా క్యాబినెట్ హోదా కట్టబెట్టింది.అయితే ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్న హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అయితే గతంలో ప్రభుత్వ పదవులు తీసుకునేందుకు చాగంటి ఇష్టపడేవారు కాదు.వచ్చిన అవకాశాలను సైతం తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి.అయితే ఈసారి మాత్రం ఆయన సమ్మతించారు. విద్యార్థులకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తానని చెప్పుకొచ్చారు. అయితే చాగంటి కి సలహాదారుడుగా నియమించడం నిరాశ కలిగించిందంటూ ఓ 30 మంది ప్రముఖులు సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం విశేషం. ఈ నియామకం విషయంలో మరోసారి పునరాలోచించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనను రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా నియమించడంపై కొత్త చర్చ మొదలైంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్తను విద్యా విలువల సలహాదారుగా నియమించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ అధ్యక్షతన ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. చాగంటి నియామకం పై చర్చలు జరిపారు. ఈ నియామకం పై పునరాలోచన చేయాలని కోరుతూ సమావేశంలో పాల్గొన్నవారు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
* గతంలో అభ్యంతరం
జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆగమ సలహాదారుగా చాగంటి నియమించారు. అప్పట్లో ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు చాగంటి. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించి చాగంటి నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సలహాదారుడుగా నియమించింది. దీంతో ఆ పదవి చేపట్టేందుకు చాగంటి కోటేశ్వరరావు అంగీకరించారు. అయితే చంద్రబాబు సర్కార్ మంచి విధానాలతోనే చాగంటి ఈ పదవి తీసుకునేందుకు ఒప్పుకున్నారు అన్న ప్రచారం ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే 30 మంది ప్రముఖులు లేఖ రాయడం విశేషం. సినీ దర్శకుడు ఉమామహేశ్వరరావు, న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులుదీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిపారు. ఏకంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అందులో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
* ఆ 30 మంది అభ్యంతరాలు అవే
కూటమి ప్రభుత్వం ఆధునిక ఆంధ్రప్రదేశ్ ను నిర్మిస్తుందని ఆశిస్తున్నతమకు చాగంటి నియామకం ఆశ్చర్యపరిచిందన్నారు.నైతిక విలువల కోసం ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటిని సలహాదారుడుగా నియమించడం ఏంటని ప్రశ్నించారు. విద్యా వైజ్ఞానిక సామాజిక రంగాల్లో చిరకాలంగా పనిచేస్తున్న తాము ఈ లేఖ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. మానవుడు ప్రకృతి రహస్యాలను ఒక్కో దాన్ని గుప్పెట్లోకి తెచ్చుకొని.. అంతరిక్షపు అంచులకు చేరుకుంటున్న కాలంలో మనం ఉన్నామని వివరించారు. ఇటువంటి సమయంలో పురాణ యుగంలోకి తీసుకెళ్లే చాగంటి లాంటి వ్యక్తులు ఎలా నైతిక విలువలు పెంపొందించగలరని ప్రశ్నించారు. అయితే ఈ ప్రముఖుల లేఖను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా? చాగంటి విషయంలో పునరాలోచన చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.