Ind Vs Aus 2nd Test: ఆస్ట్రేలియా – భారత్ మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ప్రతిసారీ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది.. క్రికెట్లో సంచలనం రేపిన మంకీ గేట్ వివాదం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే జరిగింది. నాడు హర్భజన్ సింగ్, సైమండ్స్ మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ఐసీసీ దాకా వెళ్ళింది. అనంతరం సైమండ్స్, హర్భజన్ సైలెంట్ అయిపోయారు. ఐపీఎల్ లో సరదాగా ముచ్చటించుకున్నారు.
సైమండ్స్ కన్ను మూసిన తర్వాత హర్భజన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశాడు. సుదీర్ఘ లేఖలో తన విచారాన్ని వ్యక్తం చేశాడు. ” వివాదం ఉంది. అతడు నాకు మంచి స్నేహితుడు. వివాదం తర్వాత మేమిద్దరం కలిసిపోయాం. చాలా సరదాగా మాట్లాడుకునేవాళ్లం. కానీ అతడు ఇప్పుడు భౌతికంగా లేడు. బాధగా ఉంది. అద్భుతమైన స్నేహితుడిని కోల్పోయానని” హర్భజన్ తన సంతాప సందేశంలో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తాజాగా ఆడి లైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో మహమ్మద్ సిరాజ్, హెడ్ మధ్య వాగ్వాదం జరిగింది. సిరాజ్ వేసిన ఓవర్లో 4, 6 కొట్టిన హెడ్.. తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత హెడ్ ఏదో వ్యాఖ్యానించాడు. దానికి సిరాజ్ బయటకు వెళ్ళిపో అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత మీడియాలో రకరకాల కథనాలు ప్రసారమయ్యాయి. అతడిని బాగా బౌల్ చేసావని నేను అన్నానని హెడ్ వ్యాఖ్యానించాడు. అతడు రెచ్చగొట్టడం వల్లే తను వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడానని సిరాజ్ పేర్కొన్నాడు. ఆ తర్వాత కొంతమంది మాజీ క్రికెటర్లు ఈ వ్యవహారంపై రకరకాల విశ్లేషణలు చేశారు. సునీల్ గవాస్కర్ లాంటి ఆటగాడు హెడ్ చేసిన తప్పిదం వల్లే ఇదంతా జరిగిందని వ్యాఖ్యానించాడు. మరోవైపు హెడ్ దీనిపై స్పందిస్తూ.. తానూ ఎలాంటి దురుద్దేశం పూరితమైన వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఎంట్రీ ఇచ్చారు.
కెప్టెన్లు ఏమన్నారంటే..
హెడ్, సిరాజ్ వ్యవహారం గురించి తనకు తెలియదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. అడిలైడ్ ఓటమి తర్వాత అతడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..”మైదానంలో ఏం జరిగిందో తెలియదు. వారిద్దరి మధ్య ఎప్పుడు ఘర్షణ చోటు చేసుకుందో నా దృష్టికి రాలేదు. ఇలాంటివన్నీ క్రికెట్లో సాధారణమే కదా. దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం సరికాదు. వ్యక్తిగత విమర్శలకు తావులేదు. సమయమనం పాటిస్తే ఇలాంటివన్నీ సమసి పోతాయని” రోహిత్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ దీనిపై తొలిసారిగా వ్యాఖ్యానించాడు. ” రోహిత్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతున్న భావన కలుగుతోంది. రోహిత్ మైదానంలో జరిగేవన్నీ చూస్తుంటాడు. వాటిని ఆపడానికి ప్రయత్నించడు. ఇలాంటివి రకరకాల వ్యవహారాలకు కారణం అవుతుంటాయి. ఆ విషయం అతనికి తెలియదా” అంటూ కమిన్స్ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఆస్ట్రేలియా మీడియా హెడ్, సిరాజ్ వివాదానికి విశేషమైన ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.