https://oktelugu.com/

TDP: తెలుగుదేశం పార్టీకి 2009 పాఠం

2009లో ఉమ్మడి ఏపీలో టిడిపి మహాకూటమితో కాంగ్రెస్ ను ఢీ కొట్టింది. టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కానీ ఓటు శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఓట్ల బదలాయింపు జరగలేదు. టిడిపి సీట్ల పరంగా మెరుగుపడినా.. భాగస్వామ్య పక్షాల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్ల బదలాయింపు జరగక అధికారాన్ని అందుకోలేకపోయింది.

Written By: , Updated On : March 12, 2024 / 11:45 AM IST
TDP

TDP

Follow us on

TDP: ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకోవడం ఒక ఎత్తు. సీట్లు సర్దుబాటు చేసుకోవడం మరో ఎత్తు. కానీ ఓట్ల బదలాయింపు అన్నది కీలకం. కలిసి నడవాలనుకోవడం తప్పులేదు కానీ.. ఈ నడిచే క్రమంలో భాగస్వామ్య పార్టీల మధ్య సహృద్భావ వాతావరణ ఉండాలి. ఓట్ల బదలాయింపు పై దృష్టి పెట్టాలి. అలా జరగకుంటే మాత్రం పొత్తులు ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి చాలాసార్లు చుక్కెదురు అయ్యింది. 1999లో బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. సక్సెస్ అయ్యింది. 2004లో మాత్రం పొత్తు పెట్టుకుని ఓడిపోయింది. 2009లో టిఆర్ఎస్, వామపక్షాలతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది.అప్పుడు కూడా ఓటమి ఎదురైంది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుంది.గెలుపు సాధించింది. అయితే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే సమయంలో ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగినప్పుడు మాత్రం ఆ పార్టీ గెలుపు బాట పట్టింది. లేనప్పుడు ఓటమి ఎదురైంది.

2009లో ఉమ్మడి ఏపీలో టిడిపి మహాకూటమితో కాంగ్రెస్ ను ఢీ కొట్టింది. టిఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కానీ ఓటు శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఓట్ల బదలాయింపు జరగలేదు. టిడిపి సీట్ల పరంగా మెరుగుపడినా.. భాగస్వామ్య పక్షాల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్ల బదలాయింపు జరగక అధికారాన్ని అందుకోలేకపోయింది. 2004లో 47 స్థానాలతో ఉన్న టిడిపి 2009 నాటికి 92 స్థానాలకు చేరుకుంది. కానీ 2004లో 37.59% ఉన్న టిడిపి ఓటు బ్యాంక్ 2009 నాటికి 28.12 కు పడిపోయింది. భాగస్వామ్య పక్షాల నుంచి ఓట్ల బదలాయింపు జరగకపోవడమే ఇందుకు కారణం. నాడు ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగి ఉంటే టిడిపి ఆధ్వర్యంలోని మహాకూటమి అధికారంలోకి వచ్చి ఉండేది.

తాజా ఎన్నికల్లో జనసేన, బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. దాదాపు 31 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలను వదులుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాలను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టింది. అయితే తమ బలానికి తగ్గట్టు సీట్లు దక్కలేదని జనసేనలో అసంతృప్తి ఉంది. గత ఆరు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో టిడిపి, బిజెపి శ్రేణుల మధ్య సమన్వయం లేదు. తమ నాయకత్వాలను గౌరవించలేని పరస్పరం ఆ రెండు పార్టీల శ్రేణులు వ్యతిరేక భావనతో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఓట్ల బదలాయింపు పై దృష్టి పెట్టకుంటే 2009 నాటి ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు కూడా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. వీలైనంతవరకు బిజెపి అగ్ర నేతలను ప్రచారానికి రప్పించి.. టిడిపి నమ్మదగిన మిత్రుడుగా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అటు సొంత పార్టీ శ్రేణులను సైతం బిజెపితో సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు. 2009 ఎన్నికల గుణపాఠంతో.. ఏ చిన్న అవకాశాన్ని కూడా ప్రత్యర్థులకు విడిచిపెట్టడం లేదు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.