AP Police Recruitment: ఏపీలో( Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే డీఎస్సీ ప్రకటించి 16 వేల పోస్టులను భర్తీ చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభం అయింది. నవంబర్లో టెట్ పూర్తి చేసి.. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మరోవైపు ఏపీపీఎస్సీ సైతం నోటిఫికేషన్ల జారీపై కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు ఉన్నట్లు.. వాటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉందంటూ డిజిపి ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డిజిపి ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వానికి నివేదించారు డిజిపి హరీష్ కుమార్ గుప్తా. పెరుగుతున్న నేరాల నియంత్రణకు పోలీస్ సిబ్బంది ఇంకా అవసరమని వివరించారు.
* కొంతకాలంగా నిల్..
గత కొంతకాలంగా పోలీస్ శాఖలో ( police department)కొత్త నియామకాలు లేవు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏటా జాబ్ కాలండర్ ప్రాప్తికి ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది. కానీ అమలు చేయలేక పోయింది. చివరిగా ఎన్నికలకు ముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఆ ప్రక్రియను కూడా సజావుగా ముందుకు తీసుకెళ్ల లేక పోయింది. రకరకాల సమస్యలతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చిక్కులను పరిష్కరించి కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేయగలిగింది. త్వరలో ఎంపికైన వారికి శిక్షణ కూడా ప్రారంభం కానుంది. ఇటువంటి సమయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రభుత్వానికి ఖాళీల ప్రతిపాదన చేయడం విశేషం.
* అన్ని విభాగాలతో కలిపి..
పోలీస్ శాఖలో ప్రధానంగా సివిల్( civil), ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, సిపిఎల్, పి టి ఓ, కమ్యూనికేషన్ విభాగాలు ఉంటాయి. వీటిలో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11, 639 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ విభాగంలో 315 ఎస్సైలు, 3580 సివిల్ కానిస్టేబుల్, 96 ఆర్ఎస్ఐ పోస్టులు, 2520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు డిజిపి హరీష్ కుమార్ గుప్తా. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగాల బట్టికి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
వైసిపి ప్రభుత్వ హయాంలో 2022 నవంబర్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేకపోయారు. దానికి సంబంధించి కోటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవలే 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు ఏకంగా 11 వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తే నిరుద్యోగులకు ఒక వరమే. ఏపీలో నిరుద్యోగం తగ్గడంతో పాటు పోలీస్ శాఖ పై ఒత్తిడి కూడా తగ్గుతుంది. డిజిపి ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో.. తప్పకుండా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?