CM YS Jagan : ఉద్యోగులకు జీతాలెందుకు దండగ అనుకున్నారేమో కానీ వైసీపీ సర్కారు చుక్కలు చూపిస్తోంది. చేతిలో నగదు ఉన్నా జీతాలు అందించేందుకు మాత్రం వెనుకడుగు వేస్తోంది. ఒకటో తేదీకి కేవలం 20 శాతమంది ఉద్యోగులకే జీతాలు చెల్లించింది. ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ కింద తీసుకున్న అప్పులతోనే చెల్లించగలిగింది. ఇటీవల కొన్ని మార్గాల ద్వారా ఏపీ ఖజానాకు డబ్బులు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో జీతాల సమస్య ఉండదని అంతా భావించారు. కానీ ఆ నగదు ఎటుపోయిందో తెలియదు కానీ.. జీతాల సమస్య మాత్రం అలానే కొనసాగుతోంది.
ఎప్పుడో చంద్రబాబు హయాంలో అడిగిన రెవెన్యూ లోటు రూ.10,400 కోట్లను మోదీ సర్కారు విడుదల చేసింది. దీంతో సంక్షేమ పథకాల బటన్ నొక్కేందుకు ఎటువంటి ఇబ్బందులుండవని భావించారు. రిజర్వ్ బ్యాంకు నుంచి వివిధ రూపాల్లో అప్పుల ద్వారా మరో రూ.5 వేల కోట్లు వచ్చి చేరాయి. దీంతో జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదనుకున్నారు. కానీ ఒకటో తేదీ వస్తేనే కానీ అసలు విషయం బయటపడింది. కేవలం ఇరవై శాతం మందికి మాత్రమే జీతాలు ఇవ్వగలిగారు. మిగతా 80 శాతం మందికి ఎదురుచూపులు తప్పడం లేదు.
అటు రెవెన్యూ లోటు, ఇటు అప్పుల రూపంలో వచ్చిన డబ్బులు ఎటు పోతున్నట్టు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చిన నగదు ఏం చేశారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. కేంద్రం రూ. పది వేల కోట్లు నగదు బదిలీ చేస్తే… రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తుందేమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏమైనా అప్పులు తిరిగి చెల్లించారా లేకపోతే… పాత బాకీల కింద కేంద్రమే ఆ సొమ్ములు జమ చేసుకుందా అన్నది తెలియాల్సి ఉంది. అస్మదీయ కాంట్రాక్టర్లకు ఏ పనులూ చేయకుండానే చెల్లించేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
ఏపీలో ఆర్థిక వ్యవహారాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు. ఇది ప్రైవేటు కంపెనీ కాదు. అది ప్రజాప్రభుత్వం. ప్రజలు పన్నులుగా కట్టే సొమ్ములతోనే ప్రభుత్వం నడుస్తోంది. వాటి జమా ఖర్చులపై పూర్తి సమాచారం ప్రజలకు తెలియచెప్పాలి. ఈ విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కనీస ప్రకటన చేయని ప్రభుత్వం, శ్వేతపత్రం విడుదల చేయాలని కోరడం కొంచెం అతే అవుతుంది. కానీ ప్రజల అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.