YCP: గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రధానంగా వినిపించిన పేరు ఐ ప్యాక్.2019 ఎన్నికలకు ముందు వైసీపీ కోసం పనిచేసింది ఐప్యాక్.అప్పట్లో దానికి ప్రశాంత్ కిషోర్ సారధ్యం వహించేవారు.వ్యూహకర్తగా మంచి ట్రాక్ రికార్డు ప్రశాంత్ కిషోర్ సొంతం. దేశంలో చాలా పార్టీలకు విజయాన్ని అందించారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. దీంతో జగన్ దృష్టి పీకే పై పడింది. 2017లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్. ఏకంగా వైసీపీ శ్రేణులకు ప్రశాంత్ కిషోర్ ను పరిచయం చేశారు జగన్. అక్కడ నుంచి పీకే రాజకీయ వ్యూహం ప్రారంభం అయింది ఏపీలో. రాష్ట్ర ప్రజలను జగన్ వైపు మళ్లించడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ ఘన విజయానికి కారణమయ్యారు. కానీ గెలిచిన తర్వాత అదే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ తో పాటు జగన్ కు దూరమయ్యారు. దీంతో ఐప్యాక్ టీంకు రిషిరాజ్ సింగ్ అనే కొత్త సారథి వచ్చారు. అయితే గత ఐదేళ్లుగా ఈయన నాయకత్వంలో వైసీపీకి సేవలు అందించింది ఐప్యాక్. కానీ జగన్ కు విజయాన్ని అందించలేక పోయింది. ప్యాకప్ చెప్పేసింది.
* పరస్పరం రాజీ
అయితే ఇప్పటివరకు వైసీపీ తన వ్యూహ కర్త బృందాన్ని నియమించలేదు.అదే సమయంలో ఐప్యాక్ టీం సైతం మరో పార్టీకి సేవలు అందించడం లేదు. వైసిపి గురించి ఐ ప్యాక్ కు తెలుసు.అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయాలపై సమగ్ర అవగాహన ఉంది ఆ టీంకు. అందుకే జగన్ ఇప్పుడు మళ్లీ అదే టీంను వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది. ఐపాక్ మళ్లీ ఏపీలో వైసీపీకి సేవలందించడం ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఆ టీంకు రుషిరాజ్ సింగ్ నేతృత్వం వహిస్తారా? కొత్త వ్యక్తి వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
* పెరిగిన పారితోషికం
అయితే గతం కంటే ఐపాక్ పారితోషికం పెరిగినట్లు తెలుస్తోంది.ఈ ఐదేళ్లలో సేవలందించేందుకు 100 కోట్ల మేరకు ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. నెలకు రెండు కోట్లు చొప్పున ఏడాదికి 24 కోట్లు.. ఈ ఐదేళ్లలో 100 కోట్లు ఇస్తేనే తమ సేవలందిస్తామని ఐపాక్ టీం షరతు పెట్టినట్లు సమాచారం. దీనికి జగన్ సైతం ఆమోదముద్ర వేయడంతో ఆ టీం ఏపీలో అడుగు పెట్టిందని తెలుస్తోంది. మొత్తానికైతే కేవలం ఎన్నికల వ్యూహాల కోసమే వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండడం విశేషం. అయితే 2019 ఎన్నికల్లో విజయాన్ని అందించిన ఐపాక్ టీం.. 2029లో విజయాన్ని అందించగలదా? లేదా? అన్నది చూడాలి.