Jogi Ramesh Fake Liquor Case: ఏపీలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిఐడి. ఏడాది కిందట చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం డంపు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని మూలాలు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఉన్నాయని.. అప్పట్లో నకిలీ మద్యంతో కోట్లాది రూపాయలు సంపాదించిన విషయం బయటపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నకిలీ మద్యం తయారీ జరిపి.. కూటమి ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు వచ్చేలా ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నకిలీ మద్యంతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. కూటమి వచ్చిన తర్వాత రాజకీయ కుట్రకు తెర లేపారు. అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? ఎప్పటి నుంచి ఈ తతంగం ప్రారంభం అయింది? మొత్తం అంశాలను చార్జ్ షీట్ లో పొందుపరిచింది సిఐడి.
* ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రెడ్డి సోదరులు. వీరికి జోగి రమేష్ సోదరులతో మంచి సంబంధాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారుచేసి సరఫరా చేసేవారు అద్దేపల్లి సోదరులు. వారిపై ఎటువంటి కేసులు, అరెస్టులు జరగకుండా జోగి రమేష్ చూసుకునేవారు. వీరికి పరస్పర వ్యాపార ప్రయోజనాలు ఉండేవి. ప్రతి రెండు నెలలకు ఐదు లక్షల రూపాయల చొప్పున జోగి రమేష్ నుంచి వీరికి అందేది. వ్యాపారంలో వచ్చిన కోట్లాది రూపాయల లాభాలు తిరిగి జోగి రమేష్ సోదరులకు వెళ్ళేవి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వీరి వ్యాపారం కోట్లలో జరిగింది. అద్దేపల్లి సోదరులతో పాటు జోగి రమేష్ సోదరులు బాగానే లాభపడ్డారు అనేది ఈ చార్జ్ షీట్ సారాంశం.
* కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని అక్రమాల మయంగా చూపించాలన్నది వీరి ప్రణాళిక. ఈ విషయంలో జోగి రమేష్ అద్దేపల్లి సోదరులను ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే చాలా ప్రాంతాల్లో టెండర్లు దక్కించుకున్న వ్యాపారులకు నష్టాలు తప్పవు అన్న భయం వెంటాడింది ప్రారంభంలో. అలా తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి అనుచరులు కూడా అలానే బాధపడ్డారు. ఈ విషయం మద్యం వ్యాపారంలో ఆరితేరిన అద్దేపల్లి సోదరులకు అర్థం అయింది. అప్పుడే జోగి రమేష్ అద్దేపల్లి సోదరులను పిలిపించి తంబళ్లపల్లె ద్వారా కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రణాళిక రూపొందించారు. అక్కడ నకిలీ మద్యం తయారీని ప్రోత్సహించారు. ఇందుకుగాను కొంత మొత్తాన్ని అందిస్తానని అద్దేపల్లి జనార్దన్ రావుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. నీ చేతికి మట్టి అంటకుండా చూస్తానని చెప్పడంతో.. తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారు చేయించి జయ చంద్రారెడ్డి అనుచరుల మద్యం దుకాణాలకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇలా నకిలీ మద్యం తయారుచేసిన తరువాత జోగి రమేష్ ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అద్దేపల్లి జనార్దన్ రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్టుగా జోగి రమేష్ ఈ నకిలీ మద్యాన్ని పట్టించి.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆందోళనలు చేయించారు.. అయితే జోగి రమేష్ నుంచి ఆశించిన స్థాయిలో సాయం రాకపోవడంతో అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు చిక్కిపోయారు. జరిగిందంతా చెప్పేసారు పోలీసులకు. ఇప్పుడు చార్జ్ షీట్లో అదే విషయాన్ని చెప్పింది సిఐడి..
