AP Politics: ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు స్పీడు పెంచాయి. విపక్ష నేత చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారీగా జనాలు పాల్గొంటున్నారు. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. దీనికి ప్రజల నుంచి ఆదరణ కనిపిస్తోంది. దీనిపై వైసీపీలో కలవరపాటు కనిపిస్తోంది. నేతలు చంద్రబాబుకు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు.
పనిలో పనిగా జనసేనపై సైతం విమర్శలు చేస్తున్నారు. పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు పార్టీల వైఖరిని తప్పుపడుతున్నారు. తమ పార్టీ అధినేతను సింహంతో పోల్చుతున్నారు. మరో 25 ఏళ్ల పాటు జగనే సీఎం అని తేల్చిచెబుతున్నారు. దమ్ముంటే సింగిల్ గా పోటీకి రండి అంటూ చంద్రబాబు, పవన్ లకు సవాల్ విసురుతున్నారు. పన్నుల వసూలుపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై మండిపడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రం కన్నా ఎక్కువ టారిఫ్, ఎక్కువ ధరలు ఉన్నట్లు చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ చంద్రబాబు చేసిన సవాల్ పై.. మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు కర్ణాటకలో, ఆర్టీసీ ఛార్జీలు మహారాష్ట్రంలో మనకన్నా ఎక్కువున్నాయన్న మంత్రి.. చంద్రబాబు ఎప్పుడు రాజకీయ సన్యాసం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు పాలనలో అసలు పన్నులు వసూలు చేయలేదా? పెంచలేదా? అని ప్రశ్నించారు. పన్నులు వేయకుండా ప్రభుత్వాలు నడుస్తాయా అని ప్రశ్నించారు. అనుభవశాలికి ఈ విషయం కూడా తెలియకపోవడాన్ని ఎద్దేవా చేశారు.
Also Read: Vijayasai Reddy: విశాఖ వైసీపీలో విభేదాలకు విజయసాయిరెడ్డి ఆజ్యం.. అసలు ఏం జరిగిందంటే
జనసేనపై కీలక వ్యాఖ్యలు..
పనిలో పనిగా పొత్తులపై కూడా మంత్రి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సింగిల్ గా పోటే చేసే దమ్ములేక చంద్రబాబు పొత్తుకు వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. పతనమైపోతున్న పార్టీ, తన ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. జిల్లాల పర్యటనల పేరుతో అసత్యాలు పేలితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. జనసేన పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ పార్టీకి దిశ, దశ లేదని వ్యాఖ్యానించారు. ఆశలు, ఆశయాలు లేని ఆ పార్టీ.. ఎవరు కొంటారా అని ఎదురుచూస్తుందని ఎద్దేవా చేశారు.ప్రజలకు అందుతున్న నవరత్నాలు అమలు కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు కుట్రపన్నుతున్నారని మంత్రి ఆరోపించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, కాపు నేస్తం పథకాల ద్వారా నేరుగా ప్రజలకు లబ్దిచేకూరుస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయకుండా…..పొత్తుల ఎత్తులు ఎందుకు వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అయిదేళ్ల పాలన కంటే జగన్ మూడేళ్ళ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. జగన్ ని దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ…ఆరోపణలు చేసినవారంతా కాలగర్భంలో కలవక తప్పదని మంత్రి హెచ్చరించారు.
మరో 25 ఏళ్లు జగనే సీఎం..
మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని, మరో 20-25 ఏళ్ల పాటు వైఎస్ జగనే సీఎంగా ఉంటారని అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. వైసీసీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైతే ఓటమితో భయపడుతున్నారో, ఎవరికైతే ప్రజల మద్దతు లేదో వారు ఇంకొకరి మద్దతు కోసం ఎదురు చూస్తున్నారని చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. అసలు చంద్రబాులో కాన్ఫిడెన్స్ లేదన్నారు. ఆయన పట్ల ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు.ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడే తత్వం చంద్రబాబుదన్నారు. ఇతరులపై ఆధారపడి, వారిని మోసగించి, వెన్నుపోటు పొడిచే తత్వం ఆయన సొంతమన్నారు. రాష్ట్రం మొత్తం కాళ్లరిగేలా తిరిగినా లాభం లేదన్నారు. కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేయాలన్న కోరిక తీరదన్నారు. తండ్రీ కొడుకులు, దత్తపుత్రుడికి పరాభవం తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. మొత్తానికి ఏపీలో పొత్తు పొడవక ముందే టీడీపీ, జనసేనలపై అధికార పక్షం గట్టిగానే పోరాటానికి దిగుతోంది.
Recommended Videos:
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ycp leaders fire on tdp janasena
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com