A23a: అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌బర్గ్. పేరు ఏ23ఏ. విస్తీర్ణం ఏకంగా 4 వేల చదరపు కిలోమీటర్లు. మరోలా చెప్పాలంటే పరిమాణంలో గ్రేటర్ లండన్‌తో పోలిస్తే రెండింతలలకుపైనే. అంతటి విస్తీర్ణంతో, ఏకంగా 400 మీటర్ల మందంతో భారీ సైజుతో అలరారుతూ చూసేందుకది ఓ మంచు ద్వీపకల్పంలా కన్పించేది. అలాంటి ఐస్‌బర్గ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కరగడం, కదలడం మొదలు పెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆందోళన పరుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలకు ఇది తాజా సంకేతంగా వారు పేర్కొంటున్నారు.
1986 నుంచీ…
ఏ23ఏ ఐస్‌బర్గ్ 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. అంటార్కటికా తాలూకు అతి పెద్దదైన ఫిల్ష్‌నర్ మంచు ఫలకం నుంచి విడిపోయిన భారీ ఐస్‌బర్గ్‌ల్లోకెల్ల పెద్దదిగా ఇది రికార్డులకెక్కింది. అప్పటికే ఏ23ఏపై సోవియట్ యూనియన్ ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంది. ఐస్‌బర్గ్ కదలడం మొదలవడంతో అందులోని సామగ్రినంతటినీ అది హుటాహుటిన తరలించడం మొదలు పెట్టింది. కానీ కొద్దిపాటి ప్రయాణం అనంతరం 1986 కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్ సముద్రంలో ఐస్‌బర్గ్ నిశ్చలంగా నిలిచిపోయింది. సముద్రం అడుగు భాగంతో కలిసిపోయి అలా నిలబడిపోయింది.
40 ఏళ్ల తర్వాత కదలిక..
ఇంతకాలం నిశ్చలంగా ఉన్న ఏ23ఏ ఐస్‌బర్గ్ ఇప్పుడు మరోసారి కదులుతోంది. దీనికి కారణాలపై సైంటిస్టులంతా దృష్టి సారించారు. అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరగడంతోనే ఈ ఐస్‌బర్గ్ కదలడం మొదలైందని నిర్ధారించారు. దాదాపు 40 ఏళ్ల కాలగమనంలో ఐస్‌బర్గ్ పరిమాణంలో కుంచించుకుపోయింది. దానికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది అని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే రిమోట్ సెన్సింగ్ నిపుణుడు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. వాస్తవానికి ఏ23ఏలో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సముద్ర పవనాల హోరు, ప్రవాహాల జోరుకు అదిప్పుడు వేగం పుంజుకుందన్నారు. ఇప్పుడది క్రమంగా అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తరాగ్రం వైపు కదులుతోందని తెలిపారు. ఐస్‌బర్గ్‌ల క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రమాద ఘంటికే…!
ఎంత పెద్ద ఐస్‌బర్గ్‌లైనా కాలక్రమంలో చిక్కిపోవడం, క్రమంగా కనుమరుగవడం పరిపాటే. కానీ అందుకు వందలు, కొన్నిసార్లు వేలాది ఏళ్లు కూడా పడుతుంటుంది. అలాంటి ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఏ23ఏ ఐస్‌బర్గ్ శరవేగంగా కరుగుతుండటం, కదిలిపోతుండటం ప్రమాద సూచికేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది దక్షిణ జార్జియాకేసి సాగితే అక్కడి జీవావరణానికి పెద్ద సమస్యగా కూడా మారవచ్చని చెబుతున్నారు. ఐస్‌బర్గ్ కరిగే నీటితో పెరిగిపోయే సముద్ర మట్టం ఆ ద్వీపకల్ప తీరంలో లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షుల పునరుత్పత్తి ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లాభం కూడా..
అయితే ఈ పరిణామంతో కొన్ని లాభాలూ లేకపోలేదట! ఐస్‌బర్గ్‌లు జీవనప్రదాలు కూడా. కరిగే క్రమంలో వాటినుంచి విడుదలయ్యే ఖనిజ ధూళి సమీప సముద్ర జీవజాలానికి ప్రాణాధారంగా మారుతుంది అని సైంటిస్టులు చెబుతున్నారు. మొత్తంగా 40 ఏళ్ల తర్వాత అతిపెద్ద మంచుకొండ కరగడం వేగంగా పెరుగుతున్న భూతాపానికి సంకేతంగా పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Worlds biggest iceberg move after 30 years
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com