YS Sharmila: రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికి కోల్పోయింది. రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన ఆ పార్టీ చిన్న ప్రాంతీయ పార్టీ కంటే తీసుకట్టుగా మారింది. ఆ పార్టీ పట్ల ఆదరణ ఉన్నా.. తీసుకున్న నిర్ణయాలనే ఎక్కువ మంది వ్యతిరేకించారు.అయితే ఆ పార్టీలో జవసత్వాలు నింపేందుకు పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నిస్తున్నారు. తాను దూకుడుగా వ్యవహరించడంతో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన ఓట్లు సాధించేందుకు.. జనాల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహాన్ని, అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏకకాలంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని, విపక్ష టిడిపిని షర్మిల టార్గెట్ చేసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హోదాను డిమాండ్ చేస్తూ ఆమె పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నారు. ప్రత్యేక హోదా తో పాటు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. వాస్తవంగా చెప్పాలంటే షర్మిల బాధ్యతలు తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీ ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తోంది. అధికారపక్షంపై పదునైన విమర్శనాస్త్రాలతో షర్మిల దూసుకుపోతున్నారు. అయితే ఏపీలోనే కాకుండా ఢిల్లీ వేదికగా గట్టి గళం వినిపించాలని నేడు షర్మిల దీక్ష చేపట్టనున్నారు.
ప్రత్యేక హోదా తో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల ఈ దీక్ష చేపడుతున్నారు. తద్వారా జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాలని ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తన దీక్ష ద్వారా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చే పనిలో పడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దీంతో ఆ పార్టీలను సైతం కలుపుకొని ప్రత్యేక హోదా అంశంతో పోరాడాలని షర్మిల డిసైడ్ అయ్యారు. అటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వడంతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఢిల్లీ వేదికగా షర్మిల పోరాటం చేయడం ప్రారంభించడంతో అటు అధికార వైసిపి, ఇటు విపక్ష టిడిపి పై ప్రభావం చూపనుంది.
షర్మిల దీక్ష చేయడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ వాడుకున్నారు. తనకు 25 పార్లమెంటు స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఊరువాడా ప్రచారం చేశారు. 23 ఎంపీ స్థానాల్లో ప్రజలు గెలిపించినా… అధికారంలోకి వచ్చాక జగన్ మడత పేచీ వేశారు. కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీ సాధించడంతో తాను ఏం చేయలేనని తేల్చేశారు. గత ఐదు సంవత్సరాలుగా కేంద్రంతో రాజకీయంగా స్నేహం కొనసాగించినా.. ప్రత్యేక హోదా సాధించడంలో మాత్రం విఫలమయ్యారు. ఇప్పుడు అదే అంశాన్ని షర్మిల తెరపైకి తెచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పావులు కదుపుతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఏపీలో పెంచడంతో పాటు సోదరుడు జగన్ పై రివెంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుండడం విశేషం.