World Development Report 2023: “అమెరికాలో డాలర్లు పండును.. ఇండియాలో సంతానం పండును” అప్పుడెప్పుడో శ్రీ శ్రీ మహాశయుడు రాసిన ఈ కవితను మనవాళ్లు నిజం చేసి చూపిస్తున్నారు. ఇండియాలో పుట్టిన సంతానం అమెరికాలో డాలర్ల పంట పండిస్తోంది. అరబ్ దినార్ లను వెనకేసుకుంటున్నది. మన వాళ్ళ పైసా వసూల్ కు దెబ్బకు ఆ దేశాల ప్రజల బెంబేలెత్తిపోతున్నారు. వరల్డ్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం పని కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు తమ ఆదాయాన్ని 120 శాతం పెంచుకున్నట్టు తెలుస్తోంది. దేశంలో అంతర్గత వలసలతో పోలిస్తే ఈ ఆదాయం 40 శాతం అధికమని పేర్కొన్నది. అమెరికా, అరబ్ దేశాలకు వలస వెళ్లిన వారి ఆదాయంలో గణనీయమైన వృద్ధి ఉన్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా ఉన్నత నైపుణ్యం ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్ల ఆదాయంలో అపరిమితమైన పెరుగుదల ఉన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.
మన దేశం కరెన్సీ తో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీ విలువ కాబట్టి.. ఆ దేశాలకు మన దేశ పౌరులు వలస ఎక్కువ వెళ్తున్నారు.. వీరిలో సంపాదనకు బాగా మరిగిన వారు భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2011_22 దాదాపు 11 సంవత్సరాల వ్యవధిలో 16.63 లక్షల మంది భారతీయులు మన దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా సహా 135 దేశాల్లో వీరంతా స్థిరపడ్డారు. వాస్తవంగా ప్రవాస భారతీయులు అంటే ఆరు నెలలకో, ఏడాదికో భారత్ వచ్చి కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని చూసి వెళ్లేవారు. ఇదంతా గతం. ఇప్పటి ఎన్ఆర్ఐ లు నేరుగా కుటుంబంతోనే ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత, భారీగా వెనకేసుకున్న తర్వాత ఇక్కడికి రాలేమని కరాఖండిగా చెప్తున్నారు. ఆదేశంలోనే స్థిర పడిపోతున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇటీవల విపరీతంగా పెరిగింది. స్థూలంగా చెప్పాలంటే భారతదేశాన్ని వీడిపోతున్న ప్రవాసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విద్య, ఉపాధి, వ్యాపారం.. తదితర కారణాలతో భారత్ నుంచి విదేశాలకు వెళ్ళిన వారు అక్కడే స్థిరపడిపోయేందుకు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లలు ఆ దేశ పౌరులుగానే పెరగాలని కోరుకుంటున్నారు. మన సంస్కృతి నేర్పిస్తున్నప్పటికీ.. ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటంలేదు. ఒక్క తెలుగు వారిదే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలది ఇదే పరిస్థితి.
గతంలో భారత పౌరసత్వం వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఎన్నాళ్ళున్నా పరాయి గడ్డ అనే భావన వారిలో ఉండేది. ప్రపంచీకరణ వారి ఆలోచన పూర్తిగా మార్చివేస్తోంది. భారతీక ఎంత మాత్రం తమ సొంత ప్రాంతం కాదనుకుంటున్నారు. కేవలం జన్మభూమి గానే భారతదేశాన్ని పరిగణిస్తున్నారు. ఇక విదేశాల్లో కరెన్సీ విలువ అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో మన దేశం నుంచి ఆ ప్రాంతానికి వలస వెళ్లిన వారి ఆదాయాలు అమాంతం పెరుగుతున్నాయి. మన వాళ్ళలో కష్టపడి పనిచేసే నైపుణ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఆ దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటున్నది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ నిపుణులు, వైద్యులకు డిమాండ్ ఎక్కువగా ఉంటున్నది. అక్కడ సంపాదించిన సంపాదనను మనవాళ్లు ఇక్కడి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. ఫలితంగా ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: World development report 2023 indians making a fortune abroad this is the secret
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com