Bihar: హిందూ వివాహ చట్టం ప్రకారం మన దేశంలో ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలి. రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యతో విడాకులు తీసుకోవాలి. లేందంటే ఆమె చనిపోయినా, అనారోగ్యానికి గురైనా రెండో వివాహం చట్ట ప్రకారం చెల్లుతుంది. అయితే చట్టం గురించి పట్టించుకోని చాలా మంది రెండు, మూడో పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు పెళ్లి చేసుకోకుండానే ఒకరిద్దరిని మెయింటేన్ చేయడం చూస్తున్నాం. అయితే ఇక్కడో వ్యక్తికి ఒకరు.. ఇద్దరు… ముగ్గురు కాదు ఏకంగా 40 మంది భార్యలు ఉన్నారు. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా.. నిజమే ఎందుకంటే ఆ ఊళ్లో 40 మంది మహిళలు ఒకే వ్యక్తి పేరును రికార్డుల్లో తమ భర్తగా నమోదు చేయించుకున్నారు. ఇలా ఒక్కడే 40 మందికి మొగుడయ్యాడు. ఇది చూసిన అధికారులు అవాక్కయ్యారు.
బీహార్ రెడ్‌లైట్ ఏరియాలో..
బీహార్‌లో ప్రస్తుతం రెండో దశ కులగణన జరుగుతోంది. అందులో భాగంగా కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలు తెలుసుకునేందుకు.. ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. అందులో భాగంగానే అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాలో నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు. అక్కడ సుమారు 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్‌చంద్ అని చెప్పారు. అక్కడి మహిళల పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్‌చంద్ అని తెలిపారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు.
ఆపేరే ఎందుకు చెప్పారు?
40 మంది మహిళలు, వారి పిల్లలు ఒకేపేరును భర్తగా, తండ్రిగా పేర్కొనడంపై అధికారులు తర్వాత ఆరా తీశారు. అసలు ఎవరీ రూప్‌చంద్ అని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది.. ఆ రెడ్‌లైట్ ఏరియాలో రూప్‌చంద్ అనే డ్యాన్సర్ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అక్కడ సొంత నివాసం కూడా లేదు. అయినప్పటికీ.. అతడిపై అభిమానంతోనే మహిళలు రూప్‌చంద్ పేరును.. తమ భర్త పేరుగా చెబుతున్నట్లు తెలుస్తోంది.
వివిధ కారణాలతో ఇద్దరు, ముగ్గురిని పెళ్లి చేసుకున్నవారు వారిని మెయింటేన్ చేయడానికే అపసోపాలు పడుతున్నారు. కానీ, బాహార్‌లో రూప్‌చంద్ మాత్రం తాను ఏ ప్రయత్నం చేయకుండా, ఎవరికీ తాళి కట్టకపోయినా.. 40 మంది మహిళలకు మొగుడయ్యాడు. పిల్లలకు తండ్రి అయ్యాడు. ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆడు మగాడ్రా బుజ్జీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.