Faiz Hamid : ఎవరి ఫైజ్ హమీద్.. ఇప్పుడే ఎందుకు అరెస్టు చేశారు? పాకిస్తాన్ మరో బంగ్లాదేశ్ కానుందా?

అప్పట్లో తాలిబన్ లకు పాకిస్తాన్ సహాయం చేయడంలో హమీద్ కీలక పాత్ర పోషించాడు. దీనిపై అంతర్జాతీయ సమాజం మండిపడింది.."తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆప్ఘనిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందని" విలేకరులు ప్రశ్నిస్తే.. " మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం బాగానే ఉంటుందని" హమీద్ వ్యాఖ్యానించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : ఆగస్ట్ 13, 2024 4:45 సా.

Faiz Hamid

Follow us on

Faiz Hamid : పలు ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల ఎన్నికల్లో అతని పార్టీ పోటీ చేసినప్పటికీ.. అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ ను బయటికి రానివ్వకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ఇమ్రాన్ ఖాన్ అనుచరుడు, ఒకప్పటి ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్ అరెస్టు అయ్యారు. అక్రమస్తుల కేసులో అతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2021 సెప్టెంబర్ లో ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ లు స్వాధీనం చేసుకున్న తర్వాత.. అప్పుడు హమీద్ కాబూల్ లో ఉన్నాడు. సెరేనా హోటల్ లో సేద తీరుతున్నాడు. అప్పట్లో అతడు ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు. తాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం గందరగోళం ఏర్పడినప్పటికీ.. హమీద్ మాత్రం కాబుల్ లో సెరెనా హోటల్ లో అక్కడ దృశ్యాలను ఆస్వాదించాడు. అయితే అలాంటి వ్యక్తిని ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం సోమవారం అదుపులోకి తీసుకుంది. అక్రమాస్తులను కలిగి ఉన్న నేపథ్యంలో గత ఏప్రిల్ లో అతనిపై ఫిర్యాదు నమోదయింది. అప్పటినుంచి విచారణ చేపట్టిన పాకిస్తాన్ సైన్యం సోమవారం అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ లో హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి హమీద్ ప్రధాన కారకుడని ఆర్మీ ఆరోపిస్తోంది. అందువల్లే అతడిని అరెస్టు చేసామని పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది.

పాకిస్తాన్ గూడచార సంస్థ అధిపతిగా..

2019 జూన్ నుంచి 2021 నవంబర్ వరకు పాకిస్తాన్ ప్రధాన గూడచారి సంస్థ డీజీగా హమీద్ పని చేశాడు. 2021లో ఆగస్టు నెలలో కాబూల్ ప్రాంతాన్ని తాలిబన్ లు స్వాధీనం చేసుకోవడం గనుక హమీద్ కీలక పాత్ర పోషించడాని తెలుస్తోంది. 9/11 దాడుల తర్వాత నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నాయి. 20 ఏళ్ల పాటు అక్కడే సుదీర్ఘకాలం ఉన్నాయి. ఆ తర్వాత తాలిబన్ లకు అప్పగించి వెళ్ళిపోయాయి. తాలిబన్ లు కాబుల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 4, 2021న హమీద్ ఆ నగరాన్ని సందర్శించాడు. ఆ తర్వాత తాలిబన్ లతో అనేక వ్యూహాత్మక ఒప్పందాలను హమీద్ కుదుర్చుకున్నాడని ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

అప్పట్లో పాకిస్తాన్ సహాయం

అప్పట్లో తాలిబన్ లకు పాకిస్తాన్ సహాయం చేయడంలో హమీద్ కీలక పాత్ర పోషించాడు. దీనిపై అంతర్జాతీయ సమాజం మండిపడింది..”తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆప్ఘనిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందని” విలేకరులు ప్రశ్నిస్తే.. ” మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం బాగానే ఉంటుందని” హమీద్ వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో అతడు కాబూల్ లోని సెరెనా హోటల్లో పాకిస్తాన్ దౌత్యవేత్తలతో కాఫీ తాగాడు. అప్పుడు హమీద్ చేసిన వ్యాఖ్యలు గ్లోబల్ మీడియాలో చర్చకు దారితీసాయి. అంతేకాదు తాలిబన్ లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడం వెనుక పాకిస్థాన్ ఉన్నది అనే ఆరోపణలకు బలం చేకూర్చాయి. అంతేకాదు అప్పట్లో హమీద్ తాలిబన్లకు, హక్కానీ నెట్వర్క్ తో అంతర్గత పోరు జరగకుండా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 2020లో జరిగిన దోహా ఒప్పందంలో భాగంగా అమెరికాతో తాలిబన్ చర్చలు ఫలప్రదం అయ్యేందుకు హమీద్ కృషి చేశాడని చెబుతుంటారు. మరోవైపు 1990 ల నాటి పాక్ – ఆఫ్ఘనిస్తాన్ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు హమీద్ విశేషంగా పాటుపడ్డాడని అంటుంటారు.

తుఫాన్ ముందు ప్రశాంతత..

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తో హమీద్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఐఎస్ఐ డీజీగా హమీద్ ను ఇమ్రాన్ ఖాన్ నియమించడం వెనుక కారణమదే.. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కావడం.. హమీద్ పై తదుపరి ప్రభుత్వం దృష్టి దారించింది. అప్పట్లో ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న అతడు పాల్పడిన అవకతవకలను ప్రధానంగా గుర్తించింది . దీంతో అతడిని అరెస్టు చేసింది. అయితే ఈ పరిణామాలు పాకిస్తాన్లో ముసలం పుట్టిస్తాయని.. బంగ్లాదేశ్ లాగా అక్కడ కూడా ప్రజలు హింసాత్మక బాటను ఎంచుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. తదుపరి ఏం జరుగుతుందో తెలియదు గాని.. పాకిస్తాన్ లో మాత్రం ప్రస్తుతం తుఫాన్ ముందు ప్రశాంతత లాగా పరిస్థితి ఉంది.