US presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరుగనున్నాయి.గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు, సభలు, సమావేశాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. అన్నివర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మామీల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు సర్వే సంస్థలు కూడా విజయం ఎవరిదో అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రజల నాడి పట్టే పనిలో ఉన్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఫలితాలు ప్రకటించారు. ఇందులో మొదట ట్రంప్ పైచేయి సాధించినా.. తాజా సర్వేల్లో కమలా హారిస్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇది ట్రంప్‌కు మింగుడు పడడం లేదు. ఈ క్రమంలో అక్టోబర్ 1న డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్ జరుగనుంది. ఇప్పటికే హారిస్, ట్రంప్ మధ్య జరిగిన డిబేట్‌లో కమలా పైచేయి సాధించారు. దీంతో ఆమెకు భారీగా విరాళాలు వచ్చాయి. డిబేట్ తర్వాత వచ్చిన సర్వేలో ట్రంప్ మరింత వెనుకబడ్డారు. ఉపాధ్యక్షుల డిబేట్ తర్వాత ఫలితాలు మరాతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కమలా హారిస్, ట్రంప్ మధ్య వలసల విషయమై వాగ్వాదం జరిగింది.
వలసలు నియంత్రిస్తా..
ప్రచారంలో భాగంగా కమలా హారిస్ అరిజోనాలోని డగ్లస్‌కు చెందిన యూఎస్–మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. ప్రనజలను ఉద్దేశించి కమలా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి అక్రమ వలసలు నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇమిగ్రేషన్ వ్యవస్థను సరిచేస్తామని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవారికి పౌరసత్వం కల్పించడాడనికి ప్రయత్నిస్తామని తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో విచ్ఛిన్నమైన ఇమిగ్రేషన్ వ్యవస్థను సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విదేశీయులు దేశంలోకి ప్రవేశించడానికి చట్టబద్ధమైన మార్గదర్శకాలు రూపొందించలేదన్నారు. దేశ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మాజీ సరిహద్దు రాష్ట్ర అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించిన తనకు సరిహద్దు భద్రత, చట్టాలను అమలుపై అవగాహన ఉందని తెలిపారు.
ట్రంప్ ఆగ్రహం..
కమలా హారిస్ వ్యాఖ్యలపై రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు అధికారంలో ఉన్న బైడెన్, హారిస్ ఎన్నికల వేల వలసల గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఇపుపడు వలసలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. సరిహద్దుల గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదన్నారు. ఆ సమస్య గురించి ఆలోచించేవారే అయితే నాలుగేళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమంగా ప్రవేశించేవారు అనేక నేరాలకు పాల్పడినా మౌనం వహించి ఇప్పుడు వలసల గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చిన్న పట్టణాలను హారిస్ శరనార్థుల శిబిరాలుగా మార్చారని మండిపడ్డారు.