Maria Corina Machado Nobel Prize: ఎన్నో ఆశలు పెట్టుకున్నపటికీ.. గొప్పగా ప్రచారం చేసుకున్నప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి లభించలేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్నపుచ్చుకున్నారు. వాస్తవానికి తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ట్రంప్ తెగ ప్రచారం చేసుకున్నారు. పైగా తనను శాంతి దూతగా అభివర్ణించుకున్నారు. అనేక యుద్ధాలు అపానని.. ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపేందుకు ప్రయత్నించానని అనేక సందర్భాలలో చెప్పుకున్నారు. కానీ నోబెల్ శాంతి బహుమతి ప్రకటించే కమిటీ ట్రంప్ ను ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు ఆయనను పక్కనపెట్టి.. వెనిజులా కు చెందిన మరియా కొరినా మచాడో కు నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించింది.
మరియా కొరినా మచాడో నోబెల్ శాంతి బహుమతి లభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించి చర్చ మొదలైంది. గూగుల్ లో అయితే చాలామంది ఆమె గురించి శోధిస్తున్నారు. ఇక మీడియా, సోషల్ మీడియాలో ఆమె గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. మరియా కొరినా మచాడో స్వస్థలం వెనిజులా. చిన్నప్పటినుంచి ఈమెకు విప్లవ భావాలు అధికంగా ఉండేవి. అన్యాయాన్ని సహించలేని తత్వం ఉండేది. 1967 అక్టోబర్ 7న ఈమె జన్మించింది. 2002లో వెనిజులా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ “వెంటే వెనిజులా” కు నేషనల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. 2018లో బీబీసీ 100 విమెన్, టైం మ్యాగజైన్ వరల్డ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సియల్ పీపుల్ జాబితాలో మరియా కొరినా మచాడో నిలిచారు. మరియా కొరినా మచాడో వెనిజులా దేశంలో ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రజాస్వామ్య హక్కులు, శాంతి స్థాపన కోసం ఆమె విశేషంగా కృషి చేస్తున్నారు. ఆమె చేసిన సేవలను గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
వెనిజులా దేశాన్ని ఆమె నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. ఉద్యమాలు చేశారు. స్వేచ్ఛ, సమానత్వం , గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగు వేశారు. అంతేకాదు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? దానివల్ల లభించే అవకాశాలు ఏమిటి? నియంతృత్వం కొనసాగితే దేశం ఎలా నష్టపోతుంది? అనే విషయాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలను నిత్యం జాగృతం చేశారు. అందువల్లే ఆమె వెనిజులా దేశంలో సరికొత్త శక్తిగా ఆవిర్భవించారు. ఆమె చేసిన పోరాటాన్ని, ప్రజల్లో కలిగించిన కాంక్షను గుర్తించిన నోబెల్ శాంతి కమిటీ ఆమెకు బహుమతిని అందించింది. అంతేకాదు అప్పట్లో ఆమె ఉద్యమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం దేశం దాటి వదిలి వెళ్ళకుండా ఆమెపై నిషేధం విధించింది.
నోబెల్ శాంతి పురస్కారం లభించిన తర్వాత వెనిజులా ప్రజలు మరియా కొరినా మచాడో కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా దేశంలో పుట్టిన గొప్ప బిడ్డ అంటూ కీర్తిస్తున్నారు. ఆమె వల్లే దేశంలో ప్రజాస్వామ్యం పురుడు పోసుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె చూసిన పోరాటాల వల్లే దేశంలో నియంతృత్వం అనేది నేల చూపులు చూసిందని పేర్కొంటున్నారు.