Iran: ఏమిటీ జైష్ అల్ ఆదిల్.. ఇరాన్ ఎందుకు దాడులు చేస్తోంది?

జైష్ అల్ ఆదిల్ గ్రూప్ పై తెగ చర్చ నడుస్తోంది. 2012లో ఈ గ్రూపును స్థాపించారు. 2013లో ఈ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడి 14 మంది ఇరాన్ గార్డులను చంపేసింది. ఆ ఘటనతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : January 18, 2024 3:33 pm

Iran

Follow us on

Iran: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం లక్ష్యంగా ఇరాన్ అకస్మాత్తుగా క్షిపణులతో దాడులు చేసింది. ఒక్కో క్షిపణికి 1200 నుంచి 1500 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేదించగల సామర్థ్యం ఉంటుంది. అలాంటి వాటిని ఇరాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో లెక్కపెట్టలేని విధంగా ప్రయోగించింది. ఇరాన్ అకస్మాత్తుగా ఇలా క్షిపణులు ప్రయోగించడం పట్ల మొదట పాకిస్తాన్ కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఆ తర్వాత గగనతల ఒప్పందాన్ని ఇరాన్ అతిక్రమించిందని ఆరోపించింది. ఇరాన్ చేసిన దాడులతో ఇద్దరు చిన్నారులు చనిపోయారని ఆరోపించింది. తమ దేశంలోని ఇరాన్ రాయబార అధికారిని తిరిగి అక్కడికి పంపించింది. ఇరాన్ లో పనిచేస్తున్న తమ దేశ రాయబార అధికారిని కూడా వెనక్కి పిలిపించుకుంది. అయితే అకస్మాత్తుగా ఇరాన్ దాడులు చేయడాన్ని సమర్థించుకుంది. పాక్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జైష్ అల్ ఆదిల్ సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు ఉన్నారని ఇరాన్ ఆరోపించింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో వారు ఉంటూ తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించింది.. ఇంతకీ ఇరాన్ ఆరోపిస్తున్న జైష్ అల్ ఆదిల్ గ్రూప్ ఎక్కడిది? ఇరాన్ దీనిని ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? పాకిస్తాన్ ఆ గ్రూపును ఎందుకు వెనకేసుకొస్తోంది?

జైష్ అల్ ఆదిల్ గ్రూప్ పై తెగ చర్చ నడుస్తోంది. 2012లో ఈ గ్రూపును స్థాపించారు. 2013లో ఈ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడి 14 మంది ఇరాన్ గార్డులను చంపేసింది. ఆ ఘటనతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్ లోని సిస్తాన్_ బలూచిస్తాన్ లో తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ సరిహద్దుల్లో అక్కడి భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేందుకు కారణమవుతోంది. ఈ క్రమంలో జైష్ అల్ ఆదిల్ గ్రూప్ చేస్తున్న ఆగడాలను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆ గ్రూప్ స్థావరాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ చరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ ను జైష్ అల్ ఆదిల్ గ్రూప్ కిడ్నాప్ చేసిందని, పాకిస్తాన్ గూడచర్య సంస్థకు విక్రయించిందని సమాచారం.

జైష్ అల్ ఆదిల్ గ్రూప్ చేస్తున్న ఆగడాల వల్ల ఇరాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వేర్పాటు వాదాన్ని ఈ గ్రూపు సభ్యులు నూరి పోస్తుండడంతో ఇరాన్ ప్రజలు హింసాత్మక విధానం వైపు మళ్ళుతున్నారు. ఇది ఆ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న నేపథ్యంలో జైష్ అల్ ఆదిల్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులతోనే ఇరాన్ ఆగిపోవడం లేదు. హమాస్_ ఇజ్రాయిల్ యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించింది. ఇరాక్, సిరియాలపై సోమవారం క్షిపణులతో దాడి చేసింది. ఉత్తర ఇరాన్ లోని ఇర్బిల్ లో ఉన్న ఇజ్రాయిల్ నిఘా సంస్థ మొస్సాద్ కు చెందిన ముఖ్య కార్యాలయం పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు సిరియాలోని ఐసిస్ స్థావరాలపై కూడా దాడులు చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.. ఇడ్లిబ్ లోని తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. కెర్మాన్ నగరంలో ఈనెల మూడున జరిగిన జంట ఆత్మాహుతి బాంబుదాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ వరుస దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది.