Venezuela Crisis Impact On India: ఎక్కడో ఏర్పడిన తుఫాను.. అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ఎక్కడి నుంచో వీచే చల్లని గాలులు.. సంబంధం లేని ప్రాంతాలను సైతం చల్లగా మార్చేస్తాయి. వీటిని సైన్స్ పరిభాషలో కార్యకారక సంబంధాలు అంటారు. కేవలం ప్రకృతి మాత్రమే కాదు.. దేశాల మధ్య ఏర్పడే విభేదాలు, వివాదాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి.
వెనిజుల అధ్యక్షుడిని అమెరికా బలవంతంగా అరెస్ట్ చేసింది. అక్రమంగా తమ దేశానికి తీసుకెళ్ళింది. ఈ పరిణామం తర్వాత ప్రపంచంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయనే చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు వెనిజులా పరిణామం భారత్ మీద కూడా బలంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెనిజులా పతనం భారతదేశానికి ఒక రకమైన హెచ్చరిక లాంటిది. సూటిగా చెప్పాలంటే ఖరీదైన గుణపాఠం లాంటిది.
ఒకప్పుడు వెనిజులా అనేది స్వర్గధామం మాదిరిగా ఉండేది. లాటిన్ అమెరికాలో అత్యంత వేగంగా ఎదిగిన దేశంగా వెనిజులా పేరు సంపాదించింది. ప్రపంచ టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. నిండుగా పర్యాటకులను కలిగి ఉండే సముద్రతీర ప్రాంతాలు.. ప్రపంచానికి అత్యధిక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లను అందించిన దేశంగా ఘనత సాధించింది వెనిజులా. ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలని ప్రపంచ వ్యాప్తంగా యువత కలలు కన్నదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హ్యూగో చావెజ్ వచ్చిన తర్వాత వెనిజులా రూప మొత్తం మారిపోయింది. పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసిన వ్యక్తులు మొత్తం మన దేశాన్ని దోచుకుంటున్నారు అని ఆయన ఎప్పుడైతే అన్నాడో.. అప్పటినుంచి అక్కడి ప్రజలు పూర్తిగా మారిపోయారు . చమురు బావులు మొత్తం పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్న అక్కడి ప్రజల్లో తీవ్రమైన మార్పు తీసుకొచ్చింది. చివరికి చావేజ్ వెనిజులా దేశానికి నాయకుడు అయ్యాడు. ప్రజలను ఉచితాల మాయలో పడేశాడు. అతడు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రైవేట్ కంపెనీల మొత్తం ప్రభుత్వానికి సొంతమయ్యాయి.
పెట్టుబడిదారులు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రజలకు ఉచిత పథకాల వల్ల డబ్బులు వచ్చాయి. పనిచేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉత్పత్తి క్షీణించిపోయింది. జిడిపి కుప్పకూలిపోయింది. ధరల పెరుగుదల ఆకాశాన్ని అంటింది. ఆర్థికంగా వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతున్నప్పుడు చావెజ్ నోట్ల ముద్రణ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అది వెనిజులా ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. చివరికి 1000 కోట్ల బొలివర్ నోట్ కూడా ముద్రించాల్సి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. కరెన్సీ నోట్లను మున్సిపాలిటీ కార్మికులు ట్రక్కుల్లో ఎత్తి పారేశారు. ఇంత జరిగినప్పటికీ అక్కడ ఉచిత పథకాల అమలు ఆగిపోలేదు. ఉచితం అనేది తమ హక్కుగా అక్కడి ప్రజలు భావించారు. శ్రమను మూర్ఖత్వంగా భావించారు. ప్రశ్నించడానికి ద్రోహం గా అనుకున్నారు. అందువల్ల అక్కడ “civilizational brain” డ్యామేజ్ అనే విధ్వంసం జరిగింది.
చావేజ్ చనిపోయే ముందు నికోలస్ మదురో ను తన వారసుడిగా ప్రకటించాడు. మదురో స్వతహాగా కమ్యూనిస్టు. అయినప్పటికీ ఎన్నికల సమయంలో చర్చిలకు వెళ్లేవాడు. అతడు అధికారానికి వచ్చిన తర్వాత అక్కడ దారుణాలు పెరిగిపోయాయి. ఎన్నికలిట్ రద్దు కావడం, ప్రతిపక్షాలు అణచివేతకు గురి కావడం వంటివి సాగిపోయాయి. చివరికి తనను తానే అధ్యక్షుడిగా మదురో ప్రకటించుకున్నాడు.. ప్రస్తుతం ఈ దేశానికి సంబంధించిన ప్రజలు 80 శాతం కొలంబియా, బ్రెజిల్, అర్జెంటీనాలో శరణార్థులు మాదిరిగా బతుకుతున్నారు. దేశంలో తిండి లేదు. ఉపాధి లభించడం లేదు. గౌరవం అనేది దక్కడం లేదు.. ఒకప్పుడు పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పుడేమో జీవనమే నరకం లాగా ఉంది . అందమైన యువతులకు, ఐశ్వర్యానికి చిరునామాగా ఉన్న వెనిజులా ఇప్పుడు దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.
ఉచితాల మత్తు, పరిశ్రమలపై జరిగిన దాడి, పెట్టుబడిదారులను తరిమి వేయడం, కరెన్సీ నోట్ల ద్వారా మాయ చేయడం, వారసత్వ రాజకీయాలు.. ఇలా అన్ని కలిసి వెనిజులా దేశాన్ని సర్వనాశనం చేశాయి. ఈ పరిణామలు భారత్ లాంటి దేశానికి ఒక గుణపాఠం లాంటివి. ఎందుకంటే మనదేశంలో కూడా ఉచిత పథకాలు అమలవుతున్నాయి. వీటిని అమలు చేయడానికి ప్రభుత్వాలు భూములు అమ్ముతున్నాయి. ఇక వారసత్వ రాజకీయాలు.. భావోద్వేగ ప్రకటనలు.. సెంటిమెంట్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటివల్ల దేశం ఎలాంటి దుర్భర స్థితి ఎదుర్కొంటుందో వెనిజులా చూపిస్తోంది. వెనిజులా ఉదాహరణతోనైనా భారత్ మేలుకోవాలి.