Vangaveeti Radhakrishna: వంగవీటి రాధా పొలిటికల్ కెరీర్@20 ఏళ్లు.. ఆ నష్టాన్ని చంద్రబాబు భర్తీ చేస్తారా?

వంగవీటి మోహన్ రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రాధా. కానీ రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిలయ్యారు. 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఐదేళ్లపాటు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగతా కాలాన్ని ప్రతిపక్షంలోనే గడిపేశారు

Written By: Dharma, Updated On : September 17, 2024 1:59 pm

Vangaveeti Radha political career

Follow us on

Vangaveeti Radhakrishna: వంగవీటి రాధ.. గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో వినిపిస్తున్న మాట ఇది. వంగవీటి మోహన్ రంగ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు రాధా. కానీ రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేశారు. 2009 నుంచి పదవులకు దూరంగా ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.కానీ ఓటమి ఎదురయింది. రాధా రాజకీయాల్లో ప్రవేశించి 20 సంవత్సరాలు అవుతోంది. కానీ కేవలం ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగతా 15 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు మాత్రం టిడిపిలో ఉన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాధాకు మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటుతున్నా వంగవీటి రాధా విషయంలో మాత్రం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో రంగా అభిమానులు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

* మోహన్ రంగాది ప్రత్యేక స్థానం
వంగవీటి మోహన్ రంగా తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయన పేరు మార్మోగిపోతుంది. అన్ని పార్టీల నాయకులు ఆయనను స్మరించుకుంటారు. అంతలా పెనవేసుకుపోయారు ఆయన.పేదల పెన్నిధిగా బతికారు.అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు. ఆయన ఆయుష్షు తక్కువే. రాజకీయ జీవితం కూడా తక్కువే. 1947లో జన్మించిన మోహన్ రంగా.. 1988లో మృతి చెందారు. కేవలం ఆయన జీవించింది 41 ఏళ్లు. అందులో ఆయన రాజకీయ జీవితం 20 ఏళ్లు. రాజకీయ పదవులు చేపట్టింది తక్కువే అయినా.. కాపులకు ఆశాజ్యోతి గా మారిపోయారు మోహన్ రంగా.

* రాజశేఖర్ రెడ్డి పిలుపుతో
రంగా వారసుడిని తెరపైకి తెచ్చింది మాత్రం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి. 2004లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రాధా. ఆ ఎన్నికల్లో గెలిచి చిన్న వయసులోనే శాసనసభలో అడుగుపెట్టారు. రంగా వారసుడిగా ఆయన పేరు నిలబెడతారని అంతా భావించారు. రాజకీయంగా ఎదుగుతారని కూడా ఆశించారు. కానీ రాధా తప్పటడుగులు వేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా వినలేదు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో పొలిటికల్ కెరీర్ కాస్త ఇబ్బంది పడింది.

* జగన్ పై మనస్థాపంతో
వైసిపి ఆవిర్భావంతో జగన్ పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు రాధా.జగన్ సైతం ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇచ్చారు.కానీ రాధా ఓడిపోయారు.మళ్లీ 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ అడిగారు.కానీ జగన్ మాత్రం మచిలీపట్నం ఎంపీ సీటును ఆఫర్ చేశారు.అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కోసం పట్టుపట్టారు. జగన్ ఇవ్వక పోయేసరికి అసంతృప్తితో పార్టీ మారిపోయారు. టిడిపిలో చేరి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ టిడిపి ఓడిపోయింది. వైసిపి అధికారంలోకి వచ్చింది.

* ఆ ఒక్క మంత్రి పదవి ఆయన కోసమేనా
గత ఐదేళ్లుగా టిడిపిలో కొనసాగారు రాధా. అయితే నామినేటెడ్ పోస్టుల పరంగా అవకాశం లేకుండా పోయింది. ఎమ్మెల్సీ తో పాటు రాజ్యసభ స్థానాలు దక్కించుకునే అవకాశం టిడిపికి లేదు. అందుకే రాధా సైలెంట్ గా ఉండిపోయారు. మధ్యలో వైసిపి, జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా..ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండిపోయారు. ఎన్నికల్లో టిడిపి తో పాటు కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై రాధా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే రాధ కోల్పోయిన రాజకీయ జీవితానికి తగ్గట్టు చంద్రబాబు అవకాశం ఇస్తారని టిడిపి వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఆయన కోసమే ఒక మంత్రి పదవి విడిచిపెట్టారని కూడా టాక్ నడుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.