USA: ఆ పాప వయసు 16 నెలలు. ఇంకా సరిగ్గా మాటలు కూడా రావు. బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా సందడి చేస్తుంది.. తన చేష్టలతో అలరిస్తుంది. అలాంటి చిన్నారిని చూస్తే ఎవరికైనా ఎత్తుకోవాలనిపిస్తుంది. ముద్దు చేయాలనిపిస్తుంది. అలాంటిది ఆమె తల్లికి అది నామోషి అయింది. విహారం ముందు.. తన చిన్నారి చిన్న పోయింది..
తాచుపాము తన జన్మనిచ్చిన పిల్లల్ని తనే తింటుంది. అది సృష్టి ధర్మం. నవ మాసాలు మోసి, కడుపులో తంతున్నా భరించి.. ప్రసవ వేదనను తట్టుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. తన బిడ్డను చంపుకుంటుందా? అలా చంపితే ఆమెను తల్లి అనాలా? లేక పాషాణ హృదయురాలు అనాలా? అంతటి తప్పు చేసిన ఆ మహిళకు కోర్టు కఠిన శిక్ష విధించింది. సమాజంలో మరోసారి ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా గట్టి సందేశం ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
అమెరికాలోని ల్యాండ్ ప్రాంతానికి చెందిన క్రిస్టల్ కాంటే లారియో (32).. సంపన్న కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు ఆగర్భ శ్రీమంతులు. క్రిస్టల్ కు 16 నెలల జైలిన్ అనే పాప ఉంది. డబ్బు బాగా ఉండటంతో మొదటి నుంచి క్రిస్టల్ విలాసాలకు అలవాటు పడింది. భర్త ఉన్నాడో? ఈమె విలాసాలు తట్టుకోలేక వదిలేశాడో? తెలియదు గాని.. క్లీవ్ ల్యాండ్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఇంట్లో తన కూతురితో కలిసి క్రిస్టల్ ఉంటోంది. గత ఏడాది జూన్ నెలలో తన 16 నెలల కూతుర్ని ఉయ్యాలలో పడుకోబెట్టి ఇంటికి తాళం వేసి.. క్రిస్టల్ డెట్రాయిట్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరో నగరానికి చక్కర్లు కొట్టింది.. ఇలా పది రోజులు ఇంటి మీద సోయి లేకుండా.. కూతురి మీద ధ్యాస లేకుండా ఫుల్ గా ఎంజాయ్ చేసింది. తీరా పది రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. వచ్చి చూడగానే ఉయ్యాలలో పాప నిర్జీవంగా కనిపించింది. వెంటనే క్రిస్టల్ ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేసింది. ఆమె ఇంటికి చేరుకున్న వైద్యులు పాపను చూసి చనిపోయిందని నిర్ధారించారు. అనంతరం పోలీసులు వచ్చి వివరాలు అడిగితే క్రిస్టల్ అసలు విషయం చెప్పింది. దీంతో వారు ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం కోర్టు ఎదుట హాజరు పరిచారు.
క్రిస్టల్ చేసిన నిర్వాకానికి అక్కడి కోర్టు జడ్జి నిర్ఘాంతపోయారు.. ఈ కేసును సుమారు 9 నెలల పాటు విచారించారు. అనంతరం కని విని ఎరుగని స్థాయిలో తీర్పు ఇచ్చారు.” ఇది మానవజాతి తలదించుకునే సంఘటన. ఒక మహిళ తన బిడ్డను ఇలా వదిలేసి వెళ్లడం బహుశా చరిత్రలోనే మొదటిసారి కావచ్చు. ఇలాంటి తప్పు మరో మహిళా చేయకూడదు. అందుకుగానూ కఠిన తీర్పు ఇస్తున్నాను. బెయిల్ అనేది లేకుండా ఈమెకు యావ జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నానని” జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పు నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాదులు.. సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. క్రిస్టల్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వ వైద్యులు ఆమెను పరీక్షించి అలాంటి మానసిక వ్యాధులు ఆమెకు లేవని తేల్చారు. దీంతో జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. క్రిస్టల్ వ్యవహారం అమెరికా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.