US Student visa : అమెరికాలో ఉన్నత విద్య కోసం ఎన్నో ఆశలతో వెళ్లిన భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై అమెరికా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. గత ఒకటి, రెండేళ్లలో చిన్న చిన్న తప్పిదాలను కారణంగా చూపిస్తూ వీసాలు రద్దు చేస్తూ దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తోంది. స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా బహిష్కరణకు హెచ్చరిస్తోంది. నార్త్ ఈస్ట్రన్, హ్యాంప్‌షైర్, విస్కాన్సిన్ మాడిసన్ వంటి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న అనేకమంది విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలోనే 40 మందికి వీసా రద్దు నోటీసులు జారీ కాగా, వీరిలో 18 మంది ప్రస్తుతం చదువుతున్నవారు, 22 మంది చదువు పూర్తి చేసినవారు.
వీసా రద్దుతో విద్యార్థుల స్టూడెంట్ అండ్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ప్రోగ్రాం రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విశ్వవిద్యాలయాల నుంచి ఈ–మెయిల్స్ వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలనే దిగ్భ్రాంతిలో ఉన్నారు. గత నెలలో హమాస్ అనుకూల ఆందోళనల్లో పాల్గొన్నారనే ఆరోపణలతో కొందరిని అమెరికా బహిష్కరించిన సంగతి తెలిసిందే.
Also Read : కక్ష కట్టిన అమెరికా.. రాత్రికి రాత్రికే విద్యార్థి వీసాల రద్దు!
చిన్న తప్పులకే వీసా రద్దు
అధిక వేగంతో వాహనం నడిపిన విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ నోటీసులు జారీ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి కేసులు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు చాలావరకు కొట్టివేయబడతాయి. అయినప్పటికీ, కోర్టు విచారణలో ఉన్నవారికి సైతం వీసా రద్దు నోటీసులు అందుతున్నాయి. వీసా రద్దైన వారు అమెరికాలో అక్రమంగా ఉన్నట్లుగా పరిగణించబడుతున్నారు. గతంలో ఇలాంటి చిన్న తప్పిదాలు జరిగినా విద్య, ఓపీటీ, లేదా హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉండటానికి ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు స్టేటస్ రద్దు చేస్తూ దేశం వీడాలని ఆదేశిస్తూ ఈ–మెయిల్స్ పంపిస్తున్నారు.
సామాజిక మాధ్యమాలపై నిఘా
అమెరికా ప్రభుత్వం విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా నిఘా వేస్తోంది. ప్రభుత్వ విధానాలకు, అమెరికా సంస్కతికి వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ చేసినా, స్నేహితులు లేదా ఇతరుల పోస్టులను లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఎఫ్1, ఎం1, జే1 వీసా కేటగిరీల వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఏం చేయాలి?
వీసా రద్దు నోటీసులు అందుకున్న విద్యార్థులు వెంటనే ఇమ్మిగ్రేషన్ అటార్నీని సంప్రదించాలి. వారు అమెరికా చట్టాలకు అనుగుణంగా సలహాలు అందిస్తారు. అలాగే, అమెరికాలోని తెలుగు సంఘాలను సంప్రదిస్తే సహాయం పొందే అవకాశం ఉంటుంది.
ఎవరికి నోటీసులు వస్తున్నాయి?
ఎఫ్–1 వీసాపై చదువుతున్న విద్యార్థులకు (సెమిస్టర్ మధ్యలో ఉన్నవారికి కూడా)
ఓపీటీపై ఉద్యోగం చేస్తున్నవారికి
హెచ్1బీ వీసా లాటరీలో ఎంపికైన వారికి.
నోటీసులకు కారణాలు
అమెరికాలోకి ప్రవేశించినప్పుడు, ఏదైనా కేసులో అరెస్టు అయినప్పుడు తీసుకున్న వేలిముద్రల ఆధారంగా వీసా రద్దు చేస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. దీనికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
నోటీసులకు సాధారణ కారణాలు:
అధిక వేగంతో వాహనం నడపడం
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం
చిన్న వయసు వారికి సిగరెట్, మద్యం విక్రయించడం
షాప్‌లిఫ్టింగ్ (దుకాణాల్లో పూర్తి బిల్లు చెల్లించకుండా వస్తువులు తీసుకోవడం)
గృహ హింస కేసులు
మాదకద్రవ్యాల వినియోగం.