US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. చివరి వరకు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేశారు. ఈసారి ఎన్నికలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నారు. సర్వేల్లో ఇద్దరి మధ్య ఓటింగ్‌లో తేడా కేవలం 2 శాతమే ఉంటోంది. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిదో అంచనా వేయడం కష్టంగా మారింది. పోలింగ్‌కు ఒక రోజు ముందు వెలువడిన సర్వే ఫలితాల్లో 1.8 ఓట్ల ఆధిక్యంలో ట్రంప్ ఉన్నారు. ఇక అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా అగ్రరాజ్యవైపు చూస్తున్నాయి. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారో అని లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియాలో మాత్రం ఇద్దరి నేతల రఫున పూజలు, హోమాలు చేస్తున్నారు. ట్రంప్ గెలవాలని ఆయన అభిమానులు, కమలా హారిస్ గెలవాలని ఆమె అభిమానులు పోటాపోటీ పూజలు చేస్తున్నారు.
మహా మండలేశ్వరస్వామి
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షడిగా గెలవాలని ఢిల్లీలో మహా మండలేశ్వరస్వామి యాగం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. హిందువలకు రక్షణ కల్పిస్తామని ఇటీవల ప్రకటించారు. ట్రంప్ 2016లో అధ్యక్షుడు అయినప్పుడు కూడా ప్రపంచం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని మండలేశ్వరస్వామి పేర్కొంటున్నారు. ట్రంప్‌ను భారత ఆప్తుడుగా అభివర్ణించారు. ఆయన అధ్యక్షుడైతే ప్రపంచం ప్రశాతంగా ఉంటుందని, యుద్ధాలు ఆగిపోతాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో కమలా హారిస్ తీరును తప్పు పట్టారు. హిందువులపై దాడులను ఆమె ఒక్కసారి కూడా ఖండించలేదని పేర్కొన్నారు.
కమలా పూర్వీకుల గ్రామంలో..
ఇదిలా ఉంటే..కమలా హారీస్ భారత సంతతి నేత. ఆమె పూర్వీకులది తమిళనాడు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా గెలవాలని ఆమె పూర్వీకుల గ్రామంలో కూడా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కమలా పూర్వీకులు తులసిందపురంకు చెందినవారే. ఈ ఊరుతో ఆమెకు అనుబంధం ఉంది. కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు కావాలని ఆ గ్రామస్తులు కోరుకుంటున్నారు. మధురై నగరంలో కూడా కమలా హారిస్ విజయం సాధించాలని పూజలు చేస్తున్నారు. కమలా హారిస్ ఫొటోలు, బ్యానర్లు పెట్టి పూజలు చేస్తున్నారు.