US Pilot Trapped In Iran: భారత్ పాకిస్తాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్ సమయంలో మన సుఖోయ్ యుద్ధ విమానం పైలెట్ పాకిస్తాన్ భూభాగంలో పడిపోయాడు. అయితే వెంటనే రంగంలోకి దిగిన భారత్.. మన పైలెట్‌ను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. భారత హెచ్చరికలతో వణికిపోయిన పాకిస్తాన్ మన పైలెట్‌ను అప్పగించింది. తాజాగా అంటి ఘటనే ఇరాన్ గడ్డపై జరిగింది. ఇరాన్–అమెరికా యుద్ధంలో కూలిన అమెరికా ఎఫ్–15 యుద్ధ విమానం పైలట్ పరిస్థితి ఇదే. ఆయన ఆచూకీ కోసం అమెరికా తీవ్రంగా శ్రమిస్తోంది, ఇరాన్ సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ ఆ పైలట్‌ను సజీవంగా పట్టుకుని అప్పగిస్తే 66,100 డాలర్ల బహుమతి ప్రకటించింది.
చరిత్రలో నమోదైన బందీ అనుభవాలు
అమెరికా సైనికులు శత్రువులకు చిక్కడం ఇదే తొలిసారి కాదు. గత యుద్ధాల్లో అనేక మంది పైలట్లు బందీలయ్యారు, చిత్రవధలు అనుభవించారు. 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా అపాచీ హెలికాప్టర్లపై ఇరాక్ రిపబ్లికన్ గార్డ్ మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో చీఫ్ వారెంట్ ఆఫీసర్లు డేవిడ్ విలియమ్స్, రొనాల్డ్ యంగ్ జూనియర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఇంధనం అయిపోవడం, ఇంజిన్ వైఫల్యంతో వీరు పారాచ్యూట్లతో కిందకు దిగారు. కానీ శత్రు భూభాగంలో చిక్కుకున్నారు. ఇరాక్ దళాలు వీరిని చీకటి గదుల్లో బంధించి, దారుణంగా కొట్టి విచారించాయి. బాగ్దాద్‌లోని వివిధ జైళ్లకు తరలిస్తూ, అమెరికా రహస్యాల కోసం హింసించాయి. 23 రోజులపాటు ఈ చిత్రవధ అనుభవించిన వీరికి, అమెరికా దళాలు ఇరాక్‌ను లొంగతీసుకున్న తర్వాత విముక్తి లభించింది.
శత్రు భూభాగంలో ఆరు రాత్రులు..
1995లో బోస్నియా యుద్ధ సమయంలో అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్ కెప్టెన్ స్కాట్ ఎఫ్. ఓ’గ్రేడీ విమానం కూలిపోయింది. శత్రు భూభాగంలో చిక్కుకున్న ఆయన, ఆరు రాత్రులు కొండ ప్రాంతాల్లో దాక్కోవాల్సి వచ్చింది. తాగడానికి నీళ్లు దొరకక, చీమలు తింటూ బతికారు. చివరకు రేడియో సిగ్నల్స్ అందడంతో అమెరికా మెరైన్ సిబ్బంది రెస్క్యూ మిషన్ చేపట్టి, క్షిపణులు, కాల్పుల నడుమ హెలికాప్టర్‌లోఆయనను రక్షించింది.
అత్యంత ప్రమాదకర ఆపరేషన్
శత్రు భూభాగంలో చిక్కుకున్న పైలట్‌ను రక్షించడాన్ని అమెరికా ’కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ ఆపరేషన్ అంటుంది. ఇది అత్యంత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన మిషన్. బ్లాక్ హాక్ హెలికాప్టర్లలో 24 మంది పారా రెస్క్యూ జంపర్లను మోహరిస్తారు. పైలట్ ఆచూకీ కనిపెట్టి, గాయాలను చికిత్స చేసి, త్వరగా తరలిస్తారు.
సర్వైవల్ కిట్‌తో సహాయం
అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్లకు సర్వైవల్, ఎస్కేప్, రెస్క్యూ, ఎవేషన్ అనే నాలుగు విధానాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. యుద్ధ విమానం కూలిపోతున్న సమయంలో పైలట్ బయటపడేందుకు సీటు కింద ‘సర్వైవల్ కిట్’ ఉంటుంది. ఇందులో ప్యారాచూట్ సురక్షితంగా దిగడానికి సహాయపడుతుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ గాయాలకు చికిత్స చేసుకోవడానికి, మూడునాలుగు రోజులకు సరిపడా ఆహారం, రేడియో జీపీఎస్, దిక్సూచీ, సిగ్నల్ మిర్రర్లు ఉంటాయి. సిగ్నలింగ్ కోసం స్మోక్ బాంబులు, లైట్లు, గ్లో స్టిక్స్ (రాత్రివేళ గుర్తింపుకు) ఉంటాయి. స్వీయ రక్షణకు చిన్న ఆయుధాలు కూడా ఉంటాయి.
ప్రస్తుతం ఇరాన్‌లో కూలిన ఎఫ్–15 పైలట్ కోసం అమెరికా ప్రమాదకర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ సైన్యాలు గాలిస్తుండగా, పైలట్ దాక్కోవాల్సి ఉంది. అమెరికా ’స్విస్ ఆర్మీ నైఫ్స్’ అని పిలువబడే ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పైలట్ ఆరోగ్య పరిస్థితి గురించి అమెరికా ఏమీ వెల్లడించలేదు. శత్రు గడ్డపై చిక్కుకున్న పైలట్ ప్రాణాలతో బయటపడటం అనేది సాహసోపేతమైన పోరాటం. చరిత్రలో అనేక మంది పైలట్లు బందీలయ్యారు, చిత్రవధలు అనుభవించారు. కొందరు రెస్క్యూ మిషన్లతో బయటపడ్డారు. ప్రస్తుతం ఇరాన్‌లో అమెరికా పైలట్ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. అమెరికా రెస్క్యూ మిషన్ విజయవంతమవుతుందా, లేదా పైలట్ బందీ అవుతారా అనేది వేచి చూడాలి.
