మొదట ఆసియాలోని చైనాలో పుట్టి, కకావికలం చేసిన కరోనా వైరస్, తర్వాత ఐరోపా లోని ఇటలీలో స్వైర విహారం చేసింది. ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. రోజు, రోజుకి అక్కడ కరోనా కేసులు, మృతుల సంఖ్యా పెరుగుతూ ఉండడంతో అక్కడి ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది.
కరోనా వైరస్‌కు కేంద్రంగా అమెరికా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించడంతో మరింక ఆందోలన కలుగుతున్నది. అమెరికాలో శరవేగంగా పెరుగుతున్న కేసులు, దాని తీవ్రతను బట్టి కరోనాకు ప్రధాన కేంద్రంగా అమెరికా మారే రోజు ఇంకెంతో దూరంలో లేదని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి మార్గరేట్ హరీస్ ప్రకటించారు.
సోమవారం నుంచి 24 గంటల్లో ఐరోపా అంతటా 20,131 నూతన కేసులు బయట పడితే, కేవలం అమెరికాలో మాత్రమే కొత్తగా 16,354 మందికి వైరస్ సోకిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇప్పటి వరకు అమెరికా అంతటా 54,881 మందికి కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. గత 24 గంటల్లో తొలిసారి 130 మందికిపైగా మృ త్యువాత పడటం అమెరికాను కలవరానికి గురి చేస్తున్నది.
ఆ దేశంలో మొత్తం మరణా లు 782 చేరాయి. న్యూయార్క్‌లో 210 మంది వైరస్‌తో మరణించారు. అక్కడ 25,000 మందికి పైగా, అంటే దేశంలోని మొత్తం కేసులలో దాదాపు సంగం నమోదు కావడంతో దేశంలో ఈ మహమ్మారికి ప్రధాన కేంద్రంగా నిలిచింది.
మార్చ్ మధ్య వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని లౌసియానాలో ఇప్పుడు 1388 కేసులు నమోదయి, 46 మంది మృతి చెందారు. న్యూ జెర్సీలో ఈ వారంలో మరో 800 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 3675కు చేరుకొన్నాయి. ఇక్కడ 44 మంది మృతి చెందారు.
ఇంతకుముందు కరోనా వైరస్‌ను ‘చైనీస్ వైరస్’ అంటూ కొట్టిపారవేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వైద్య పరికరాలు, ఔషధాలతోపాటు హ్యాండ్ శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లు తదితర వ్యక్తిగత రక్షణ పరికరాల కృత్రిమ కొరతను నిరోధించడానికి, వ్యాపారులు వాటిని ఎక్కువ ధరలకు విక్రయించకుండా నిలువరించేందుకు తయారు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
అయితే కరోనా వైరస్ కట్టడికి దేశమంతా ‘షట్‌డౌన్’ ప్రకటించాలన్న వైద్యుల సూచనను అమలు చేయడానికి మాత్రం ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ప్రపంచం మొత్తం ఏండ్లుగా లాక్‌డౌన్ ప్రకటించినా తాము ఆ పని చేయనని స్పష్టం చేశారు.
కాగా, కరోనా నివారణలో కీలకంగా భావిస్తున్న క్లోరోక్వీన్ ఔషధ నిల్వలను సేకరించడంపై దృష్టిని కేంద్రీకరించామని ట్రంప్ తెలిపారు. అమెరికాలో న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ రాష్ట్రాలపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రాల పరిధిలో సైన్యాన్ని రంగంలోకి దించారు.