భారత్ లో తొలి కరోనా వైరస్ కేసు జనవరి 30నే వెల్లడైనప్పటికీ కరోనా పరీక్షలు నిర్వహించడంలో, ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి అవసరమైన మాస్క్ లను, పరీక్షా పరికరాలను సమకూర్చుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష ధోరణి అవలంభించిన ఫలితంగానే ఇప్పడు దేశ వ్యాప్తంగా దిగ్బంధనం అమలు చేస్తున్నా పరిస్థితులు ఆందోళన కరంగా మారుతున్నాయా? అంటే అవుననే నిపుణులు భావిస్తున్నారు.
కరోనా ఎదుర్కోవడానికి అవసరమైన సామాగ్రి గురించి మొదటిసారిగా మార్చ్ 18న అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశం జరిగింది. అప్పటి నుండి ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయమై దృష్టి సారిస్తున్నారు. ఆ నాటి సమావేశంలో మనదేశంలో అవసరమైన సామగ్రి కొరతను అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
మాస్కులు, శరీరాన్ని కప్పుకొని కవర్ల కొరత భారీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వాటిని సమకూర్చుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. స్మ్రితి ఇరానీ నిర్వహిస్తున్న జౌళి శాఖ ఆధ్వర్యంలో 23 మిల్లులు పనిచేస్తున్నా వాటిల్లో పెద్ద ఎత్తున మాస్కుల ఉత్పత్తికి ఇప్పటికి ప్రయత్నం చేయడం లేదు.
మార్చ్ 23వ తేదీ వరకు భారత్‌లో కేవలం 18,383 మందికి మాత్రమే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 433 మందికి కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే దాదాపు సగం కేసులు నమోదయ్యాయి. అదే మార్చి 18వ తేదీ నాటికే ఇటలీలో 1,65,541 మందికి, దక్షిణ కొరియాలో 2,95,647 మందికి పరీక్షలు నిర్వహించారు.
దక్షిణ కొరియా ప్రతి రోజూ 20 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తోంది. బ్రిటన్ రోజుకు 1500 ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మున్ముందు రోజుకు పది వేల మందికి చొప్పున పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది.
భారత్ కరోనా పరీక్షలు ఇంత తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని పుణేకు చెందిన ‘గ్లోబల్ హెల్త్, బయోటిక్స్, హెల్త్ పాలసీ’ రిసర్చర్ అనంత్ భాన్ హెచ్చరిస్తున్నారు.
భారత్‌లో ఇంతవరకు ప్రభుత్వ లాబరేటరీల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా 12 ప్రైవేటు ల్యాబుల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అనుమతి ఇచ్చింది.
దేశవ్యాప్తంగా 118 ప్రభుత్వ ల్యాబుల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్య ఉండగా ఇంతవరకు 92 ల్యాబుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 26 ల్యాబుల్లో పరీక్షలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
తెలంగాణలో సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల ఆస్పత్రి, హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాల ఆస్పత్రి ల్యాబుల్లోనే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా, తాజాగా హైదరాబాద్, జూబ్లీ హిల్స్‌లోని అపోలో ప్రైవేటు ఆస్పత్రికి కోవిడ్ పరీక్షల అనుమతి మంజూరు చేసినట్లు ఐసీఎంఆర్ తెలియజేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీవేంకటేశ్వర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి), రంగరాయ మెడికల్ కాలేజ్ (కాకినాడ), సిద్ధార్థ మెడికల్ కాలేజ్ (విజయవాడ), గవర్నమెంట్ కాలేజ్ (అనంతపురం) ల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఒక్క ప్రైవేటు ఆస్పత్రికి ఇప్పటి వరకు అనుమతి లభించలేదు.
ప్రభుత్వ అనుమతి ల్యాబుల్లో కూడా ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన వారికి, కరోనా నిర్ధారితుల బంధువులకు, వారితో సన్నిహితంగా మెదిలిన వారికి మాత్రమే ఈ పరీక్షలు జరపుతున్నారు.
పైగా, భారత దేశం ఆది నుంచి ప్రజారోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్లయితే నేడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం అంతకష్టమయ్యేది కాదని నిపుణులు భావిస్తున్నారు. 2018–19లో దేశంలో ఆరోగ్య రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో కేవలం 1.28 శాతం కేటాయింపులు జరపగా, 2019–20 లో జీడీపీలో 1.5 శాతం, 2020–21లో 1.6 శాతం నిధులను మాత్రమే కేటాయించారు. మన పొరుగునున్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లు మనకన్నా ఎక్కువ నిధులను కేటాయిస్తున్నాయి.