Iran US Conflict 2026: పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా పరిస్థితి దయనీయంగా మారింది. 38 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ లొంగడం లేదు, శాంతి చర్చలకు అంగీకరించడం లేదు. హర్మూజ్ జలసంధిని తన గుప్పెట్లో పెట్టుకుని, ప్రపంచ చమురు రవాణాను నియంత్రిస్తోంది. అమెరికా, దాని మిత్రదేశాలను ఫుట్‌బాల్ ఆడుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా ముందు రెండే మార్గాలు మిగిలాయి. ఒకటి భూతల దాడులతో ఇరాన్‌ను ఆక్రమించుకోవడం, లేదా దౌత్యపరంగా శాంతి ఒప్పందం చేసుకోవడం. కానీ రెండూ సాధ్యం కాని పనిగా మారుతున్నాయి.
ఇరాన్ గుప్పెట్లో ప్రపంచ చమురు రవాణా
హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ప్రపంచ చమురు మార్కెట్ గుండెకాయ. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం(రోజుకు 21 మిలియన్ బ్యారెల్స్) ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ ఇప్పుడు దీనికి పూర్తిగా అడ్డుకట్ట వేసింది. కొన్ని దేశాలకు (భారత్, చైనా, రష్యా) ఇరాన్ అనుమతి ఇస్తోంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాల నౌకలను పూర్తిగా నిషేధించింది. హర్మూజ్ మూసివేతతో అమెరికాలో పెట్రోల్ ధరలు గ్యాలన్‌కు 4.09 డాలర్లు పెరిగింది. డీజిల్ 5.33కి చేరింది. ఐరోపా దేశాలు సంక్షోభం ఎదుర్కొంటున్నాయి.
భూతల దాడులు సాధ్యమా?
ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌ను భూతలం నుంచి ఆక్రమించుకోవాలని భావిస్తోంది. కానీ ఇది అంత సులభం కాదు. ఇరాన్‌లో రెండు పెద్ద ఎడారులు ఉన్నాయి. ఇవి సైనిక చలనానికి భారీ అడ్డంకులు. ఇరాన్ సైన్యం ఈ ఎడారుల గుండా ఎలాంటి దాడులు చేస్తుందో అమెరికాకు అంచనా లేదు. ఇటీవలే ఇరాన్ అమెరికా ఎఫ్–15ఈ ఫైటర్ జెట్‌ను కూల్చివేసింది. ఆ విమానంలోని పైలట్లను రక్షించడానికి అమెరికాకు మూడు రోజులు పట్టింది. ఇది ఇరాన్ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని నిరూపించింది. భూతల దాడులు చేస్తే యుద్ధం త్వరగా ముగియదు. ఇరాన్ గెరిల్లా యుద్ధతంత్రంతో అమెరికా సైన్యాన్ని ఇరుకున పెట్టవచ్చు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ తరహాలో అమెరికా ఇరాన్‌లో కూడా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. యుద్ధం ఇంకా నెలల తరబడి సాగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడుతుంది. ప్రపంచ చమురు ధరలు మరింత పెరిగి, మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది.
దౌత్య చర్చలకు ఇరాన్ షరతులు..
అమెరికా దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. కానీ ఇరాన్ షరతులు అమెరికాకు అంగీకారం కావడం లేదు. హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని గుర్తించాలి, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి, అణు కార్యక్రమాలపై రాజీపడబోమని ఇరాన్ తేల్చిచెప్పింది.45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ‘గతంలో చాలాసార్లు మోసపోయాం, ఇక శాశ్వత పరిష్కారం కావాలి‘ అని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇరాన్ షరతులకు అమెరికా అంగీకరించే అవకాశం లేదు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిపై నియంత్రణను ఇరాన్‌కు అప్పగించడం, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం అమెరికాకు అంగీకారం కాదు.
ట్రంప్ హెచ్చరికల వ్యూహం..
ట్రంప్ ఇరాన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బూతు పదాలను వాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా అమెరికా జాతిని ఉద్దేశించి ట్రంప్ మరోసారి ప్రసంగించనున్నారు. కానీ 38 రోజులుగా ఆయన చేసిన హెచ్చరికలకు ఇరాన్ లొంగడం లేదు. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ భయపడడం లేదు. బదులుగా హర్మూజ్‌ను మరింత కట్టుదిట్టం చేసి, అమెరికా విమానాలను కూల్చివేస్తోంది.
38 రోజుల యుద్ధంలో ట్రంప్ ఏమీ సాధించలేదు. ఇరాన్ లొంగడం లేదు, హర్మూజ్ తెరవడం లేదు. ట్రంప్ జాతిని ఉద్దేశించి చేయబోయే ప్రసంగం ఈ యుద్ధం గమ్యాన్ని నిర్ణయించనుంది. సీజ్‌ఫైర్ జరిగితే ప్రపంచానికి మేలు, లేదంటే అమెరికా మరింత లోతైన సంక్షోభంలోకి కూరుకుపోవడం ఖాయం.