Unclaimed Bank Money : మన దేశంలోని బ్యాంక్‌లలో వేల కోట్ల రూపాయలు ఎవరికీ కాకుండా అలాగే పడి ఉన్నాయి. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక పెద్ద అడుగు వేశారు. సరైన వ్యక్తులకు ఈ డబ్బును తిరిగి ఇచ్చేలా చూడాలని ఆమె అన్ని ఆర్థిక నియంత్రణ సంస్థలకు, సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ డబ్బు మీ బంధువులదో లేదా మీదేనా అని తెలుసుకోవాలని అనుకుంటే వెంటనే అలర్ట్ అవ్వండి.
బ్యాంక్‌ల దగ్గర రూ.78 వేల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం KYC ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ఆర్థిక సేవలను సులభంగా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా లేదా ప్రక్రియలోని సంక్లిష్టత వల్ల తమ సొంత డబ్బును పొందలేకపోతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. మార్చి 2024 నాటికి బ్యాంక్‌లలో ఎవరూ అడగకుండా ఉన్న డిపాజిట్లు రూ.78,213 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 26శాతంఎక్కువ. ఈ డబ్బులో కేవలం బ్యాంక్ డిపాజిట్లు మాత్రమే కాకుండా, షేర్లు , డివిడెండ్లు , బీమా,పెన్షన్ సంబంధిత నిధులు కూడా ఉన్నాయి.
ఈ డబ్బు ఎవరికి వస్తుంది?
ఇప్పుడు ప్రభుత్వం ఈ డబ్బును నిజమైన యజమానులకు చేర్చడానికి ఒక ప్రణాళికను తయారు చేసింది. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమం భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెబీ, బీమా నియంత్రణ సంస్థలు , పెన్షన్ నియంత్రణ సంస్థలు, బ్యాంక్‌ల సంయుక్త సహకారంతో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఆర్థిక సేవల కార్యదర్శి, సెబీ అధిపతి తుహిన్ కాంత్ పాండే, ఐబీబీఐ అధ్యక్షులతో సహా అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Also Read: పాన్ కార్డును వాడటం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా..?
KYC వ్యవస్థను డిజిటల్‌గా, సులభంగా మార్చాలని అందరూ అంగీకరించారు. ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని కూడా నిర్ణయించారు. దీని వల్ల చాలా మంది తమకు తెలియకుండానే బ్యాంక్‌లలో పడి ఉన్న సొంత డబ్బును తిరిగి పొందగలుగుతారు. కాబట్టి, ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలను, పాత పెట్టుబడులను పరిశీలించండి. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయిన వారి ఖాతాలు ఉంటే, వాటి వివరాలు కూడా తెలుసుకోండి.