US Government Shutdown 2023: అమెరికాలో డాలర్లు పండుతాయి. అవకాశాలు ఆపారంగా లభిస్తాయి. అందుకే ప్రపంచాన్ని శాసించే శక్తి సామర్ధ్యాలు దానికి ఉన్నాయి. అది ఏం చెబితే అది ఐక్యరాజ్యసమితి వింటుంది. అది ఏం శాసనం విధిస్తే ప్రపంచం మొత్తం దానిని అనుసరిస్తుంది. అందుకే అమెరికా అంటే ప్రపంచ దేశాలన్నింటికీ హడల్. అంతటి కాకలు తీరిన ఉత్తర కొరియా, టెక్నాలజీని కొత్త పొంతలు తొక్కించే జపాన్, ఉత్పత్తికి కొత్త అర్థం చెప్పే చైనా.. వంటి దేశాలు అమెరికాకు అందుకే సలాం కొడతాయి. కానీ అలాంటి అమెరికా ఇప్పుడు బేల చూపులు చూస్తోంది. తన కంటి సైగతో ప్రపంచాన్ని శాసించే అగ్రదేశం షట్ డౌన్ ముప్పు ఎదుట నిలిచింది.
వస్తువుల ఉత్పత్తి పడిపోవడం, చేసిన ఉత్పత్తులను ఎవరూ కొనుగోలు చేయకపోవడం.. అంతిమంగా పేరుకుపోయిన వస్తువుల వల్ల నష్టాలు రావడం.. దీనినే ఆర్థిక శాస్త్రం పరిభాషలో ఆర్థిక మాంద్యం అంటారు. అప్పుడెప్పుడో 2008_09 కాలంలో ప్రపంచానికి చుక్కలు చూపించిన ఆర్థిక మాంద్యం.. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో సినిమా చూపిస్తోంది. వెస్ట్రన్ కంట్రీస్ ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిలలాడుతున్నాయి. దీనికి అమెరికా కూడా మినహాయింపు కాదు. అయితే ఇప్పుడు ఈ ఆర్థిక మాంద్యం వల్ల అమెరికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. వరుసగా ఒక ఏడాదిలో అమెరికా లాంటి అగ్ర దేశం ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుదుర్కొబోతున్న తీరు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అమెరికాలోని ఫెడరల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రిపబ్లికన్ల వైఖరిని అధికారిక డెమోక్రాట్లు నిరసిస్తున్నారు. దీంతో షట్ డౌన్ వైపు ఆ దేశం అడుగులు వేస్తోంది.
మరో వైపు దేశంలో షట్ డౌన్ పరిస్థితులను నివారించేందుకు నిధుల విడుదలను మరో 30 రోజులపాటు పొడిగించాలని ప్రవేశపెట్టిన బిల్లును అమెరికా ప్రజాప్రతినిధుల సభ తిరస్కరించింది. రిపబ్లికన్ కు చెందిన హౌస్ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ ప్రవేశపెట్టిన బిల్లు 198_232 ఓట్ల తేడాతో ఓడిపోయింది..కాగా, షట్ డౌన్ కనుక అమల్లోకి వస్తే దేశంలోని ముఖ్య శాఖలు, విభాగాలకు నిధులు, సిబ్బందికి జీతాలు నిలిచిపోతాయి. ఆర్థిక అత్యయిక స్థితిని అమెరికా ఎదుర్కోవాల్సి రావడం ఈ ఏడాదిలో ఇది రెండవసారి. అయితే అంతటి ఆర్థికమాంద్యంలోనూ ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోలేదు. మరి షట్ డౌన్ ఎదుట నిలిచిన అమెరికా ఎప్పటికీ కోలుకుంటుంది? దీనివల్ల ప్రపంచంలోని మిగతాదేశాల మీద పడే ప్రభావం ఎంత? అగ్రరాజ్యంగా ఎదగాలి అనుకుంటున్న చైనా దీనిని అనుకూలంగా మార్చుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలవాలంటే కొంత కాలం ఎదురు చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.