Women Reservation Bill 2023: మహిళా రిజర్వేషన్ల బిల్లు.. అప్పటికి కూడా కష్టమేనా?

2026 లో జనగణన, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన తర్వాతే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తుందని, ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించిన నోటిఫికేషన్ లో ప్రకటించింది.

Written By: Bhaskar, Updated On : October 1, 2023 1:46 pm
Follow us on

Women Reservation Bill 2023: 35 ఏళ్ల నిరీక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శుభం కార్డు పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించగానే.. ఎక్కడా లేని ఆనందం అతివల్లో వ్యక్తం అయింది. ఇక భారత్ లో నవ నారీ శకం మొదలైందని అందరూ అనుకున్నారు. బాణ సంచా కాల్చారు. మిఠాయిలు తినిపించుకున్నారు. జయహో మహిళా అంటూ నినదించారు. అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ ఎన్నికలు మాత్రమే కాదు, ఎన్నికల్లోనూ అమలయ్యేది కష్టమైన అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడే అమల్లోకి వస్తుందా?

2026 లో జనగణన, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన తర్వాతే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తుందని, ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించిన నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత అమలులోకి వచ్చే మహిళ రిజర్వేషన్ బిల్లుపై బిజెపి సర్కారు ఇప్పుడు ఎందుకు అంత ఆర్భాటానికి పోతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళా బిల్లును ఒక అస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఆ బిల్లు మరుగున పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ, ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమల్లోకి రాని పలు చట్టాలను విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.. సిఏఏ అనే చట్టం ఏడుసార్లు గడువు మార్చుకుంది. ఇంతవరకు అది అమలులోకి రాలేదు.

రాజముద్ర పడినప్పటికీ

ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 లేదా అంతకుముందు దేశంలోకి ఇవ్వాల్సిన హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్, జైన్, పార్సీ మతాలకు చెందిన వారికి పౌర సత్వాన్ని మంజూరు చేసే ఉద్దేశంతో 2019లో కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చింది. డిసెంబర్ 2019లో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదముద్ర వేశాయి. జనవరి 10, 2020 నుంచి చట్టం అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం వివరించింది. అయితే, సీఏఏలోని కొన్ని క్లాజులు కొన్ని వర్గాలపై వివక్షపూరితంగా ఉన్నాయంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వని కేంద్రం.. చట్టంలోని ఇబ్బందులను సవరిస్తామని ఇప్పటివరకు ఏడుసార్లు గడువును పొడగించింది. దీంతో ఈ చట్టానికి రాజముద్ర పడినప్పటికీ అమలుకు నోచుకోలేదు.

ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ విషయంలోనూ..

అసలైన భారత పౌరులు ఎవరో, అక్రమ వలసదారులు ఎవరో గుర్తించేందుకు 2019లో కేంద్రం జాతీయ పౌర పట్టికను(ఎన్ఆర్సీ)
తీసుకొచ్చింది. 1971, మార్చి 24 తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చి, కార్డులో నమోదు కానీ వలసదారుల సంఖ్యను గుర్తించే కసరత్తు ఇది. అయితే ఇది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఇక, జన గణనకు కాపీగా 2019లోనే తీసుకొచ్చి విమర్శల పాలయిన జాతీయ జనాభా రిజిస్టర్ ( ఎన్పీఆర్) ఇప్పటివరకు ఐదు సార్లు వాయిదా పడింది. ఇక 2014 నుంచి ఇప్పటివరకు 40 కి పైగా బిల్లులు పార్లమెంటు ఉభయ సభల ముందు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 12 బిల్లులకు లోక్ సభ, మరో మూడు నుంచి నాలుగు బిల్లులకు ఉభయ సభల ఆమోదం లభించింది. అయినప్పటికీ ఆ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి మాత్రం రాలేదు. అయితే మరో ఏడాదిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చట్టాలను బిజెపి తెరపైకి తీసుకొస్తుందా? లేకుంటే ఇంకేమైనా విషయాలను వ్యూహాత్మకంగా ప్రచారంలో పెడుతుందా? అనేది తేడాల్సి ఉంది