Trump tariffs: కర్ర ఉన్న వాడిదే బర్రె. వెనకటికి ఈ సామెత ఈ సందర్భంలో వాడారో తెలియదు గాని.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో ఇది నూటికి నూరు శాతం సరిపోతుంది. అగ్ర రాజ్యానికి అధిపతి కావడంతో ట్రంప్ ప్రపంచం మీద పెత్తనం సాగిస్తున్నాడు. తనకు లొంగని దేశాలను లొంగే విధంగా చేసుకుంటున్నాడు. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండోసారి అధ్యక్షుడైన తొలి రోజుల్లో ట్రంప్ అమెరికాలో ఉంటున్న అనేకమంది విదేశీయులను వారి వారి దేశాలకు పంపించాడు. అంతటితో ట్రంప్ ఆగలేదు.. సుంకాలు విధించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా రష్యాతో చమరు కొనుగోలు చేస్తున్న దేశాల మీద దారుణంగా సుంకాలు విధించాడు.
సుంకాలు విధించినప్పటికీ భారత్ వ్యాపారాలు సాగిస్తూ ఉండడం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉండటం వల్ల అమెరికాకు ఏమాత్రం నచ్చడం లేదు. బెదిరింపులకు గురిచేసి భారత్ ను తన దారికి తెచ్చుకోవాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో 50 శాతం సుంకాలు విధించినప్పుడు రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే చమురు మొత్తాన్ని తగ్గించినట్టు వార్తలు వచ్చాయి. అదే విషయాన్ని ట్రంప్ కు విన్నవించినట్టు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి అమెరికా లాంటి దేశానికి భారత్ ఇలా తల ఉంచడం ఎంత మాత్రం మంచిది కాదు. పైగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల మీద 500% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. అయితే ట్రంప్ తీసుకున్న ఇలాంటి పనికిమాలిన నిర్ణయాన్ని భారత్ లాంటి అతిపెద్ద వినియోగదారులు ఉన్న దేశం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. భారత్ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేయాలని.. అమెరికా మీద మాత్రమే కాకుండా, ఇతర మార్కెట్ల మీద కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి టారిఫ్ లను తట్టుకుని నిలబడితే.. దీర్ఘకాలంలో ప్రయోజనాలు పొందవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
మన దేశం మీద అమెరికా ఇప్పటికే 50% టారిఫ్ విధిస్తోంది. అప్పట్లో అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల భారత్ కుప్పకూలుతుందని అందరూ అనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. సంపద మొత్తం ఆవిరి అయిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా పరిస్థితి మారిపోయింది. అప్పటి మాదిరిగా కాకపోయినప్పటికీ, అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు వెళ్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ సుంకాల వల్ల అమెరికాలో ఉన్న కస్టమర్ల మీదనే భారం ఎక్కువగా పడుతుంది. ట్రంప్ వల్ల అమెరికాలో ఆ వస్తువులను కొనేవారికి ఆర్థికంగా భారం పెరిగింది. ఈ ఎఫెక్ట్ ఇండియన్ కంపెనీల ఎగుమతుల మీద కాస్త ప్రభావం చూపించింది. అంతేగాని ఆ సంస్థలు భారీగా నష్టాలు చవిచూసిన దాఖలాలు లేవు.
ఇప్పుడు ట్రంప్ చెబుతున్నట్టుగా 500% సుంకాలు విధించినప్పటికీ ఎగుమతులు కాస్తలో కాస్త క్షీణిస్తాయి. అయితే అమెరికా మార్కెట్లో భారతదేశం నుంచి వచ్చే వస్తువుల ధర పెరుగుతుంది. అలాంటప్పుడు అమెరికా ప్రజలు వాటిని ఒకవేళ ఎంచుకుంటే.. పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు ట్రంప్ వెయ్యి శాతం సుంకాలు విధించినప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి వస్తువుల పరిమాణం తగ్గుతుంది.. 500% సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్పగానే భారత్ లోని స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. 8 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. వాస్తవానికి ఈ నష్టం స్టాక్ మార్కెట్ చరిత్రలో కొత్తది కాకపోయినప్పటికీ.. ట్రంప్ కు భయపడడం మొదలైతే.. అలానే ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కాస్త నిలబడి గట్టి సవాల్ విసిరితే అన్నీ మూసుకొని కూర్చుంటాడు.