Trump-Xi meeting: అగ్రరాజ్యం అమెరికా… రెండో అగ్రరాజ్యం చైనా.. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ట్రంప్ 2.0 పాలనలో చైనాపై సుంకాలతో విరుచుకుపడుతున్నాడు. చైనా కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా దిగుమతులపైనా సుంకాలు విధిస్తోంది. మరోవైపు అమెరికాకు ఎగమితి చేసే రేర్ ఎర్త్ మినరల్స్‌పై పట్టు బిగిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఇరు దేశాల అధినేతలు తాజాగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ కొరియా నగరం బూసాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మధ్య గురువారం జరిగిన భేటీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రెండు గంటలపాటు ముగిసిన ఈ చర్చలు గత కొన్ని నెలలుగా ఉత్కంఠ రేపిన వాణిజ్య ఉద్రిక్తతలకు కొంత ఊరట తీసుకువచ్చాయి.
ఫెంటనిల్ సుంకాల తగ్గింపు..
చైనాపై విధించిన 20 శాతం ఫెంటనిల్ టారిఫ్‌ను 10 శాతానికి తగ్గించారని ట్రంప్ ప్రకటించారు. ఫెంటనిల్ ముడి పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే అంశంపై జిన్ పింగ్ వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమెరికాలో పెరుగుతున్న ఓపియాయిడ్ వ్యసన సంక్షోభానికి పరిష్కారం కోసం ద్వైపాక్షిక సహకారానికి నాంది అని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
అరుదైన ఖనిజాలపై విప్లవాత్మక ఒప్పందం
ఇక ఇదే సమయంలో అరుదైన ఖనిజాల సరఫరాలో ఇటీవల తలెత్తిన సంక్షోభం ఈ సమావేశంలో పరిష్కారమైంది. ఇరుదేశాలు ఒక సంవత్సర కాలానికి ఎగుమతి–దిగుమతి నిర్బంధాలపై సడలింపు ఇవ్వడానికి అంగీకరించాయి. గతంలో 100 శాతం సుంకాల హెచ్చరికలు అమెరికా నుంచి రావడం, ఇప్పుడు వాటి ఉపసంహరణ చైనా పరిశ్రమలకు ఉపశమనం తీసుకువచ్చింది. చైనాతో రైతు ఉత్పత్తుల వ్యాపారం మళ్లీ మొదలవుతుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికా సోయాబీన్ ఎగుమతులకు చైనా తక్షణ అనుమతి ఇవ్వడంతో మధ్య పశ్చిమ రాష్ట్రాల వ్యవసాయ రంగానికి ఇది కీలక మలుపుగా మారనుంది.
ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆపేందుకు సహకారం..
ట్రంప్ ప్రకారం, యూరప్ సంక్షోభ పరిష్కారంలో చైనా సహకరించడానికి అంగీకరించింది. ఈ అంశం వాషింగ్టన్–బీజింగ్ సంబంధాలను కేవలం ఆర్థికం దాటి గ్లోబల్ భద్రతా స్థాయి వరకు విస్తరింపజేసే అవకాశముంది. ఈ చరిత్రాత్మక భేటీ ఎయిర్‌పోర్టు పరిధిలో జరగడం ఆశ్చర్యం కలిగించింది. అయితే సమయాభావం కారణంగా తక్షణంగా ఈ వేదికను ఎంచుకున్నట్లు తెలింది. షెడ్యూల్ ప్రకారం ట్రంప్ వెళ్లే ముందు చివరి నిమిషంలో భేటీ ఏర్పాటు కావడంతో అది తాత్కాలిక ప్రదేశంలో పూర్తయింది.
జిన్ పింగ్‌కి 12 మార్కులు..
ప్రసంగంలో ట్రంప్ జిన్ పింగ్‌ను ‘తన కాలంలో అత్యంత మేధావి నాయకుడు’గా చిత్రీకరించారు. ‘‘10లో 12 మార్కులు ఆయనకు ఇవ్వగలను’’ అని ఆయన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ప్రతిబింబించాయి.
ఈ భేటీతో తాత్కాలిక ఉద్రిక్తత తగ్గినప్పటికీ, పూర్తి వాణిజ్య ఒప్పందానికి మార్గం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా వచ్చే ఏడాది చైనాపై వాణిజ్య విధానాల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు ఈ సమావేశం ద్వారా వెలుగులోకి వచ్చాయి.