Trump Tariff Impact: ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్‘ నినాదంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీగా ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. తమ దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవాలని చూస్తున్నారు. ఎవడేమైపోతే నాటకేంటి అనుకుంటూ.. మిత్ర దేశాలను శత్రువుగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే భారత్, చైనా వంటి దేశాల నుంచి దిగుమతులపై 25 శాతం వరకు సుంకాలు విధించారు. అయితే, ఈ ధోరణి అమెరికా ఆర్థిక వ్యవస్థపై విపరీత పరిణామాలను కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సుంకాలు అమెరికా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసిన దాఖలాలు ఇప్పటికే కనిపించాయి, దీర్ఘకాలంలో ఇవి ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.
Also Read: బామ్మర్ధి కళ్లల్లో ఆనందం కోసం హరీష్ రగిలిస్తోన్న ‘సెంటిమెంట్’
అమెరికన్లపైనే భారం..
25 శాతం సుంకాలు విధించడం వల్ల దిగుమతి వస్తువుల ధరలు గణనీయంగా పెరుగుతాయి, దీని ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో 2.4 శాతం, దీర్ఘకాలంలో 1.2 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల పెరుగుదల సామాన్య అమెరికన్లపై ఏడాదికి సుమారు రూ.2 లక్షల అదనపు ఖర్చును మోపుతుంది. దిగుమతులు తగ్గినప్పటికీ, అమెరికా సొంతంగా ఈ వస్తువులను ఉత్పత్తి చేయలేకపోతే, అధిక ధరలకు దిగుమతులు చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఈ భారం అమెరికా వినియోగదారులపైనే పడుతుంది, జేపీమోర్గాన్‌చేజ్ ఇన్‌స్టిట్యూట్ అంచనా ప్రకారం, ఈ సుంకాల వల్ల అమెరికా కంపెనీలపై సుమారు రూ.7 లక్షల కోట్ల భారం పడవచ్చు. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి కంపెనీలు రెండు మార్గాలను ఎంచుకోవచ్చు. ఒకటి, వస్తువుల ధరలను పెంచడం.. రెండు, లాభాలను తగ్గించుకోవడం. ధరలు పెంచితే, వినియోగదారులపై భారం మరింత పెరుగుతుంది, లాభాలు తగ్గితే, కంపెనీల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. ఈ రెండు పరిస్థితులు అమెరికా ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావితం చూపుతాయి.
Also Read: నల్గొండ జిల్లాలో లిల్లీపుట్ నాయకుడు ఎవరు.. కవిత ఆ స్థాయిలో విమర్శలు చేయడానికి కారణమేంటి?
ప్రమాదంలో అంతర్జాతీయ వాణిజ్యం..
ట్రంప్ సుంకాలకు ప్రతిగా ఇతర దేశాలు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఉంది. ఇది అమెరికా ఎగుమతులను తగ్గించి, ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలను బలహీనపరుస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ వాణిజ్యం 50 శాతం వరకు క్షీణించవచ్చు. అమెరికా ఎగుమతులు తగ్గడం వల్ల ఉపాధి అవకాశాలు, ఆర్థిక ఉత్పత్తి, మొత్తం జీడీపీపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఈ వాణిజ్య యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టవచ్చు. సుంకాల వల్ల జీడీపీ తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల అమెరికన్ డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంది. కొందరు నిపుణులు డాలర్ విలువ 50 శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంలో బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) స్వంత వాణిజ్య కరెన్సీని అభివృద్ధి చేసే అవకాశం ఉంది, ఇది డాలర్‌ను ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్న స్థానం నుంచి దిగజార్చవచ్చు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది. దీంతో గ్రేట్ అమెరికా కాస్త గ్రేవ్(శ్మశానం) అమెరికాగా మారే ప్రమాదం ఉంది.