Trump H-1B visa fee hike: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతదేశ యువత మీద తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల హెచ్ వన్ బీ హోల్డర్లకు అమెరికాలో ఇకపై ప్రవేశం నిషేధం గా కనిపిస్తోంది. ఈనెల 21 ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమెరికాలోకి ప్రవేశించే అవకాశం హెచ్ వన్ బీ హోల్డర్లకు ఏమాత్రం ఉండదు. వారికి కొత్త ఫీజు నిబంధన వర్తిస్తుంది. హెచ్ వన్ బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ ప్రకటించారు. దానికి సంబంధించిన దస్త్రంపై సంతకం కూడా చేశారు. హెచ్ 1 బీ హోల్డర్లను అమెరికాలోకి అనుమతించాలంటే కచ్చితంగా వాళ్ళు పని చేస్తున్న సంస్థ ప్రతి ఏడాది ఫీజుగా దాదాపు 88 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. హెచ్ వన్ బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు.. అమెరికాలో ఎంట్రీకి సెప్టెంబర్ 21 తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే అవకాశం ఉండడంతో టెక్ కంపెనీలు మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాయి. సెలవులు, వ్యాపారం.. అమెరికా బయట ఉన్న ఈ హెచ్ వన్ బి వీసా దారులు మొత్తం ఆందోళనకు గురయ్యారు. దీంతో వారంతా ఒక్కసారిగా అమెరికా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. విమానాశ్రయాలలో భారీగా క్యూలు ఉన్నాయి. ఫ్లైట్ల టికెట్ల ధరలు మూడింతలు పెరిగిపోయాయి. ఒకరకంగా విమానాశ్రయాలలో జాతర వాతావరణం కొనసాగుతోంది. ట్రంప్ ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం మీద ఇలానే ఉంది. మరోవైపు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మనదేశంలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. మన దేశ యువత వారి ప్రతిభతో.. ఇండియాను అభివృద్ధి చేసుకోవాలని చర్చ మొదలైంది. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా.. మన యువత వారి ప్రతిభతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయం, సాంకేతిక రంగం, స్టార్టప్ రంగాలలో అపారమైన అవకాశాలు ఉన్నాయని.. ప్రతి సవాల్ ను అవకాశం గా మార్చుకొని దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ” అమెరికా అధ్యక్షుడు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ చెత్తగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి వల్ల ప్రపంచం మొత్తం ఆగమవుతుంది. దీనికి భారతదేశం మినహాయింపు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశ యువత సత్తా చాటాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. ప్రతి బంధకాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటుంది ఆర్థికంగా బలపడుతుందని” నిపుణులు చెబుతున్నారు.