100 Percent Tariff On Pharma Imports: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు పేల్చారు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకాలు అమలవుతున్నాయి. తాజాగా ట్రంప్ సెప్టెంబర్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్‌పై 100% టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు. ఇది ‘అమెరికాలో ఔషధ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్న కంపెనీలకు మినహాయింపు‘ అని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రధానంగా మల్టీనేషనల్ దిగ్గజాలను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే భారతీయ జెనరిక్, బయోసిమిలర్ డ్రగ్స్ ఎగుమతులపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఫార్మా ఎగుమతుల్లో భారత్‌కు అమెరికా అతిపెద్ద మార్కెట్. ఈ టారిఫ్ భారత ఫార్మా రంగం ఆర్థికాలకు తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా మార్కెట్ మీద ఆధారం..
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద జెనరిక్ ఔషధాల సరఫరాదారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఔషధ ఎగుమతులు 27.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వీటిలో 8.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు (సుమారు 30%) అమెరికాకు మాత్రమే వెళ్లాయి. 2024లో 3.6 బిలియన్ డాలర్లు ఔషధాలు, 2025 మొదటి అర్ధవార్షికంలో 3.7 బిలియ¯Œ డాలర్ల ఔషధాలు∙ఎగుమతులు జరిగాయి. అమెరికాలో వాడుకలో ఉన్న 45% జెనరిక్ డ్రగ్స్, 15% బయోసిమిలర్స్ భారత్ నుంచే వస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లూపిన్, అరబిందో వంటి కంపెనీలకు అమెరికా మార్కెట్ నుంచి 30–50% రెవెన్యూ వస్తోంది. ఐక్యూబీఐఏ అంచనాల ప్రకారం, భారతీయ జెనరిక్స్ 2022లో అమెరికా ఆరోగ్య వ్యవస్థకు 219 బిలియన్ డాలర్లు ఆదా చేశాయి. మెడికేర్, కమర్షియల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో 50% జెనరిక్స్ భారత్ నుంచే వస్తున్నాయి. ఈ క్రమంలో వంద శాతం టారిఫ్ ప్రభావం పరిమితం కాకుండా విస్తరించవచ్చు. ప్రస్తుతం టారిఫ్ బ్రాండెడ్/పేటెంటెడ్ డ్రగ్స్‌పైనే ఉన్నప్పటికీ, కాంప్లెక్స్ జెనరిక్స్, స్పెషాల్టీ మెడిసిన్స్‌పై కూడా అనిశ్చితి ఉంది. భారత్‌కు మొత్తం ఎగుమతులు 86.5 బిలియన్ డాలర్ల (2025 అంచనా) నుంచి 2026లో 50 బిలియన్‌కు తగ్గవచ్చని జీటీఆర్‌ఐ రిపోర్ట్ సూచిస్తోంది.
టారిఫ్ ప్రభావం ఇలా..
ఈ 100% టారిఫ్ విధానం భారతీయ కంపెనీల లాభాలపై నేరుగా దెబ్బ తీస్తుంది. అమెరికా మార్కెట్‌లో ధరలు రెండు రెట్లు అవుతాయి, దీంతో డిమాండ్ తగ్గవచ్చు. ఉదాహరణకు, సన్ ఫార్మా వంటి కంపెనీలకు 40% రెవెన్యూ అమెరికా నుంచే వస్తుంది. ఇది ఒక్కసారిగా పడిపోతే, లాభాలు 20–30% తగ్గే అవకాశం. మొత్తం రంగం 2025–26 ఆర్థిక సంవత్సరంలో 5–7 బిలియన్ డాలర్ల ఎగుమతి నష్టాన్ని ఎదుర్కొనవచ్చు. అమెరికాలో ఔషధ ధరలు పెరిగి ఇన్‌ఫ్లేషన్, డ్రగ్ షార్టేజ్‌లు తలెత్తవచ్చు. ఇది ట్రంప్ లక్ష్యానికి విరుద్ధం కావచ్చు. భారత్‌లో ఉద్యోగాలు (ఫార్మా రంగంలో 3 మిలియన్ పైగా), ఆర్‌అండ్‌డీ ఇన్వెస్ట్‌మెంట్స్ పై కూడా ప్రభావం పడుతుంది. ఇంతకు ముందు ఆగస్టు 2025లో భారత్ మీద 25% టారిఫ్ (రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల కారణంగా 50%కు పెరిగింది), ఫార్మా మినహాయింపు ఇచ్చినా, ఇప్పుడు అది ముగిసినట్టుంది.
ఎలా అధిగమించాలి..
టారిఫ్ నుంచి మినహాయింపు షరతు – అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మించడం – భారతీయ కంపెనీలకు అవకాశం. ఇప్పటికే కొన్ని కంపెనీలు (అరబిందో, గ్లాండ్ ఫార్మా) సంస్థలు అమెరికాలో ప్లాంట్లు స్థాపిస్తున్నాయి. ట్రంప్ మే 2025లో ప్రవేశపెట్టిన ఎంఎఫ్‌ఎన్ డ్రగ్ ప్రైసింగ్ పాలసీ కూడా ధరలను బెంచ్‌మార్క్ చేస్తూ, భారత్‌కు సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో భారత్ యూరప్, ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా మార్కెట్లపై దృష్టి పెట్టాలి. అమెరికాలో ఫ్యాక్టరీలు బిల్డవడం ద్వారా టారిఫ్ ఎవాయిడ్ చేయవచ్చు. అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ చర్చల్లో ఫార్మా మినహాయింపు కోరాలి. ఈ మార్పులు భారత ఫార్మాను మరింత గ్లోబల్‌గా, రెసిలియెంట్‌గా మార్చవచ్చు.
ట్రంప్ టారిఫ్‌లు అమెరికా మాన్యుఫాక్చరింగ్‌ను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి, కానీ ఇది అమెరికన్ కన్సూ్యమర్లకు ధరలు పెంచి, ఔషధ లభ్యతను దెబ్బతీస్తుంది. భారత్‌కు ఇది సవాలు అయినప్పటికీ, అమెరికాలో ఇన్వెస్ట్‌మెంట్స్, మార్కెట్ విస్తరణ ద్వారా అవకాశాలుగా మలిచుకోవచ్చు.