World’s Longest Traffic Jam : ఢిల్లీ-ఎన్‌సిఆర్ లేదా బెంగళూరు, హైదరాబాద్ పెద్ద నగరాల్లో ప్రజలు ట్రాఫిక్ జామ్‌లను ఎదుర్కోవడం సర్వసాధారణం. ప్రజలు ఆఫీసుకు వెళ్లాలంటే ఎక్కువ సమయం రోడ్ల మీద గడపాల్సిందే. ఇంటి నుంచి బయటకు రాగానే వాహనాల వేగం తగ్గిపోతుంది. ట్రాఫిక్ జామ్ నుండి ఎలా బయటపడాలనే కోరిక ఒక్కటే మనసులో ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌లో కూరుకుపోయాక.. జీవితమంతా ఇక్కడే వృధా అయిపోతుందేమో అనిపిస్తుంది. కొన్ని నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటేనే ఇలా అనిపిస్తే.. 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆలోచిస్తేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి కదా.. కానీ ఇది నిజంగా జరిగింది. 12 రోజులుగా ట్రాఫిక్ జామ్‌లో ప్రజలు ఇరుక్కున్నారు. వాహనాలు కనీసం కదలేని పరిస్థితిలో నరకం చూశారు. ఆ 12రోజులు జనజీవనం ఆ జామ్‌లో అస్తవ్యస్తంగా మారిపోయింది.
ప్రపంచంలో అత్యంత పొడవైన ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఉంది?
చైనా రాజధాని బీజింగ్‌లో ప్రజలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రాఫిక్ జామ్‌ను ఎదుర్కొన్నారు. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా ఇది విస్తరించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే పొడవైన ట్రాఫిక్ జామ్‌గా నమోదైంది. ట్రాఫిక్ జామ్‌లో ఇది ప్రపంచ రికార్డు. ఆ సమయంలో చైనా జాతీయ రహదారి 110పై లక్షలాది వాహనాలు ఆగిపోయాయి. 12 రోజులుగా వాహనాలు, వాహనాల్లో కూర్చున్న వారు రోడ్డుపైనే నిలిచిపోయారు. ఈ జామ్ మొత్తం ప్రపంచ చరిత్రలో అత్యంత పొడవైన జామ్. కనుచూపు మేరలో వాహనాలు మాత్రమే కనిపించాయి.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రాఫిక్ జామ్ ఎప్పుడు, ఎలా ఏర్పడింది?
ఆగస్ట్ 14, 2010న బీజింగ్-టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 12 రోజుల పాటు వాహనాల్లోనే జనం ఇరుక్కుపోయేంత జామ్ ఏర్పడింది. అక్కడే తిని, తాగి, ట్రాఫిక్ జామ్‌లోనే పడుకోవాల్సి వచ్చింది. మంగోలియా నుంచి బీజింగ్‌కు బొగ్గు, నిర్మాణ సామగ్రిని ట్రక్కులు తీసుకువెళ్లడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో బీజింగ్-టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ఉంది. దీంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న ఎక్స్‌ప్రెస్‌వే పనుల కారణంగా ట్రాఫిక్‌ను వన్‌వేగా మార్చారు. మంగోలియా నుంచి బీజింగ్‌కు నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న ట్రక్కులు బీజింగ్ నుంచి నిష్క్రమణను అడ్డుకున్నాయి. కొద్దిసేపటికే జామ్ చాలా పొడవుగా మారింది.. అది జామ్ క్లియర్ చేయడానికి అధికారులకు 12 రోజులు పట్టింది.
వాహనాల్లో లోపాలు
ఎక్స్‌ప్రెస్‌వే అప్పుడే నిర్మాణం అవుతుంది. మంగోలియా నుండి బొగ్గును తీసుకువచ్చే ట్రక్కుల కాన్వాయ్ రహదారి గుండా వెళ్ళలేకపోయింది. పలు వాహనాలు కూడా చెడిపోవడంతో రోడ్డు మీద నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ఇరుక్కుపోయిన వాహనాలు ఒక్కరోజులో కిలోమీటరు దూరం మాత్రమే వెళ్లగలిగే విధంగా జామ్ ఏర్పడింది.
ప్రజలకోసం తాత్కాలిక ఇళ్లు
వాహనాల జాతరను చూసిన తర్వాత ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే తాత్కాలిక ఇళ్లు నిర్మించి, తినుబండారాలు విక్రయించే దుకాణాలను తెరిచారు. చిరుతిళ్లు, శీతల పానీయాలు, నూడుల్స్, ఆహార పదార్థాలు నాలుగు రెట్లు ఎక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించారు. ప్రజలు 10 రెట్లు ఎక్కువ ధరకు నీటిని కొనుగోలు చేయాల్సి వచ్చింది.
మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా ఈ బీజింగ్ ఖ్యాతికెక్కింది. ఇప్పటికీ ఇందులో చిక్కుకున్న ప్రజలు అది తలుచుకుంటే ఒళ్లు జలదరిస్తుందని చెబుతారు.. 12 రోజులు నరకం చూశామని.. ఇదో హారిబుల్ స్టోరీ అంటూ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు