Kamala Harris vs. Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచారు. మరోవైపు.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు, కమలా హారిస్ తొలి భేటీకి వేళయింది. ఇద్దరి భేటీ రేపు(మంగళవారం) అమెరికా బ్రాడ్కాస్టర్ ఏబీసీ నిర్వహిస్తుంది. డెమొక్రటిక్ అభ్యర్థిగా జోబైడెన్ ఉన్నపుపడు ట్రంప్‌తో డిబేట్ నిర్వహించారు. కానీ, ఈ డిబేట్‌లో బైడెన్ తేలిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా కమలా, ట్రంప్ మధ్య జరిగే డిబేట్‌పై ఆసక్తి నెలకొంది. ఈసారి అధ్యక్ష ఎన్నికల పోరు.. ఇరువురి మధ్య నువ్వా–నేనా అనే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల అభ్యర్థులు డిబేట్ కోసం సిద్ధం అవుతున్నారు. ఇక రేపు జరగబోయే డిబేట్‌లో ఎలాంటి నియమాలు, నిబంధనలు ఉంటాయనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏబీసీ డిబేట్ రూల్స్‌ను వెల్లడించింది.
డిబేట్ రూల్స్ ఇవీ..
ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో మంగళవారం రాత్రి 9:00 గంటలకు డిబేట్ ప్రారంభం అవుతుంది. ఈ డిబేట్‌ను ఏబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక.. డిబేట్ జరిగే గదిలో ప్రేక్షకులు ఎవరూ ఉండరు. చర్చను ఏబీసీ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్లు నిర్వహిస్తారు. మొత్తం చర్చ సమయం రెండుసార్లు బ్రేక్ తీసుకొని 90 నిమిషాల పాటు జరుగుతుంది. ఒకరు మాట్లాడుతున్న సయయంలో మరోకరు రన్నింగ్ కామెంట్రీ చేయటంతో ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన తొలి డిబేట్ వివాదాస్పదమైంది. అందుకు ఈసారి ఒకరు మాట్లాడుతుండగా, మరొకరి ఏబీసీ మైక్‌లను మ్యూట్ చేస్తారు. డిబేట్ జరిపించే యాంకర్లు మాత్రమే సంబంధిత అంశాలు, ప్రశ్నలను అభ్యర్థులను అడుగుతారు. ఎటువంటి అంశాలనే విషయాన్ని ముందుగా అభ్యర్థలకు తెలియజేయరు. మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది.
ప్రతీ అభ్యర్థికి రెండు నిమిషాల సమయం..
ప్రతీ అభ్యర్థి మాట్లాడాటానికి రెండు నిమిషాలు సమయం కేటాయిస్తారు. ఒకరు మాట్లాడిన తర్వాత.. మరొకరు మాట్లాడుతారు. నిబంధనలు ప్రకారం కొనసాగింపు, వివరణ, ప్రతిస్పందనకు సంబంధించి మరో నిమిషం కేటాయిస్తారు. చర్చ చివరిలో ముగింపు వ్యాఖ్యల కోసం ఇరువురికి రెండు నిమిషాల సమయం కేటాయిస్తారు. చర్చ మొత్తం అభ్యర్థులు నిల్చొని కొనసాగించాల్సి ఉంటుంది. ముందస్తుగా రాసుకున్న నోట్స్, డాక్యుమెంట్లు చర్చకు అనుమతించరు. కానీ డిబేట్ జరగుతున్న సమయంలో కీలక విషయాలను నోట్ చేసుకొని వాటి ఆధారంగా మాట్లాడం కోసం ఇద్దరు అభ్యర్థులకు ఒక పెన్ను, పేపర్ ప్యాడ్, వాటర్ బాటిల్ అందజేస్తారు. చర్చ మధ్యలో రెండు సార్లు ఇచ్చే బ్రేక్ సమయంలో తమ ప్రచారం బృందంతో మాట్లాడానికి అనుమతి లేదు.
ట్రంప్, కమలా మధ్య రేపు జరిగే తొలి డిబేట్‌పై అమెరికా ప్రజలు, ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ డిబేట్ ఫలితం కూడా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్తుల గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతుంది.