https://oktelugu.com/

SSC GD Constable Jobs : ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌… 39 వేల ఉద్యోగాలు.. అర్హతలు, దరఖాస్తుల వివరాలివీ

సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి కేంద్రం భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 9, 2024 10:25 pm
    Notification for SSC GD Constable Jobs

    Notification for SSC GD Constable Jobs

    Follow us on

    SSC GD Constable Jobs : కేవలం పదో తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వం భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశంలోని కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ గురువారం(సెప్టెంబర్‌ 5న) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తంగా 39,481 కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం అక్టోబర్‌ 15వ తేదీ రాత్రి 11 గంటల వరకు చెల్లించవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా, తెలుగుసహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతోపాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అసోం రైఫిల్స్, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తారు.

    పోస్టులు ఇలా..
    నోటిఫికేషన్‌లో మొత్తం 39,481 ఉద్యోగాలు ఉండగా.. వీటిలో 35,612 పురుషులు, 3,869 మహిళా కేటగిరీలో భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. బీఎస్‌ఎఫ్‌ అత్యధికంగా 15,654 పోస్టులను భర్తీ చేయనుండగా.. సీఐఎస్‌ఎఫ్‌ 7,145, సీఆర్పీఎఫ్‌లో 11,541, ఎస్‌ఎస్‌బీలో 819, ఐటీబీపీలో 3,017, ఏఆర్‌లో 1,248, ఎస్‌ఎస్‌ఎఫ్‌ 35, ఎన్‌సీబీలో 22 చొప్పున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

    నోటిఫికేషన్‌లోని మరిన్ని అంశాలు…

    – వేతనం: పే లెవెల్‌ –1 కింద ఎన్సీబీలో సిఫాయి ఉద్యోగాలకు రూ.18 వేల నుంచి రూ. 56,900 చొప్పున ఇవ్వనుండగా.. ఇతర పోస్టులకు పే లెవెల్‌ –3 కింద రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.

    – అభ్యర్థుల వయసు: జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండాలి.. 23 ఏళ్లు మించరాదు. ఆయా వర్గాల వారీగా వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

    – దరఖాస్తు రుసుం: రూ.100 (మహిళలు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్ మెన్‌ వర్గాలకు చెందినవారికి మినహాయింపు)

    – ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, పీఈటీ/పీఎస్‌ఈ/ వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

    – కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. 60 నిమిషాల పాటు ఉండే ఈ పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలకు 160 మార్కులు ఉంటాయి.

    – పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌/హిందీ సబ్జెక్టుల్లో ఒక్కో అంశంలో 20 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు.

    – ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. సమాధానం రాసేముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

    తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..

    చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.