Pro Kabaddi Schedule : ప్రో కబడ్డీ సంబంధించి ప్రారంభ మ్యాచ్ లు హైదరాబాదులో జరుగుతాయి. అక్టోబర్ 18న తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్ ద్వారా ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 మొదలవుతుంది. అదే రోజు రెండో మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో యూ ముంబా, దబాంగ్ ఢిల్లీ జట్లు తలపడతాయి. గతానికంటే భిన్నంగా ఈసారి ప్రో కబడ్డీ పోటీలను మూడు నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాదులోని గచ్చిబౌలి జిఎంసి బాలయోగి క్రీడా సముదాయంలో మ్యాచ్ లు నిర్వహిస్తారు. దేశ రాజధాని ఢిల్లీకి సరిహద్దులో ఉన్న నోయిడాలో నవంబర్ పది నుంచి డిసెంబర్ ఒకటి వరకు మ్యాచ్ లు నిర్వహిస్తారు. పూణే వేదికగా డిసెంబర్ 3 నుంచి 24 వరకు మిగతా మ్యాచులు నిర్వహిస్తారు. ఆ తర్వాత కీలకమైన ప్లే ఆప్స్, ఫైనల్ మ్యాచ్ లను టోర్నీ మధ్యలో ప్రకటిస్తారు. ఇక తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.
అనేక మార్పులు చేపట్టారు
వీక్షకుల నుంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రో కబడ్డీ లీగ్ లో అనేక మార్పులు తీసుకొచ్చారు. మ్యాచ్ మొత్తం రసవత్తరంగా సాగేలా ప్రణాళిక రూపొందించారు. ఈసారి కొత్త ఆటగాళ్లు సందడి చేస్తారని.. గ్రామీణ క్రీడ ఆయన కబడ్డీకి మరింత గుర్తింపు తీసుకొస్తారని పీకేఎల్ కమిషనర్ అనుపమ్ గోస్వామి వెల్లడించారు.” ఇప్పటికే 10 సీజన్లు పూర్తయ్యాయి. 11వ సీజన్ కు రంగం సిద్ధమైంది. ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నాం. కార్పొరేట్ హంగులు అద్దుకోవడం ద్వారా కబడ్డీ విశ్వవ్యాప్తమవుతోంది. ఇది మన గ్రామీణ క్రీడకు దక్కిన గొప్ప వరమని” గోస్వామి అన్నారు.
ఈసారి వినూత్నంగా పోటీలు
అయితే ఈసారి ప్రో కబడ్డీ పోటీలను వినూత్నంగా నిర్వహించనున్నారు. కొత్త కంపెనీలు రావడంతో ఆటగాళ్లకు ఇచ్చే ఫీజు కూడా పెరిగిందని వార్తలు వస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు భారీగా ప్రమోట్ చేయడంతో ఆటగాళ్లకు కూడా విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి. పెద్దపెద్ద నగరాలలో ప్రో కబడ్డీ తరహాలోనే ఇతర టోర్నీలు జరుగుతున్నాయి. దీంతో ఇతర ఆటగాళ్ల మాదిరి కబడ్డీ క్రీడాకారులు సంపాదిస్తున్నారు. సంవత్సరంలో ఎక్కడో ఒకచోట టోర్నీలో పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఆటగాళ్లు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. ప్రకటనల ద్వారా కూడా భారీగానే ఆదాయాన్ని వెనకేసుకుంటున్నారు. గ్రామీణ క్రీడలను నమ్ముకొని కోటీశ్వరులవుతున్నారు.