https://oktelugu.com/

World Suicide Prevention Day 2024 : పోరాడాలి.. గెలవాలి.. అదే జీవిత పరమార్ధం: నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 7 లక్షల మంది కంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఇలా చనిపోతున్న వారి సంఖ్య కరోనా మహమ్మారులు ప్రబలినప్పుడు కన్నుమూసే వారి కంటే ఎక్కువ. అయితే వీరిలో ఎక్కువ శాతం యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్నవారు జీవితానికి ఎండ్ కార్డు వేసుకోవడం ఆవేదనను కలిగిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 10, 2024 / 03:12 PM IST

    World Suicide Prevention Day 2024

    Follow us on

    World Suicide Prevention Day 2024  : పురాణ కాలంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు.. ఆమె ఆచూకీ గాలించే బాధ్యతను రాముడు హనుమంతుడికి అప్పగించాడు. హనుమంతుడు ఎక్కడెక్కడో తిరిగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సీతాదేవి జాడ తెలుసుకోకుండా రాముడికి ముఖం ఎలా చూపించాలో తెలియక.. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఆ సమయంలో ఆకాశవాణి ప్రత్యక్షమైంది. అతడి బాధ్యతను గుర్తించింది. దీంతో హనుమంతుడు తనలో శక్తిని గుర్తించాడు. ఆ తర్వాత అశోకవనంలో సీత జాడను తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే..

    వీరాధివీరుడైన హనుమంతుడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడం పిరికిపంద చర్యగానే మనకు కనిపించవచ్చు. కాకపోతే ఆ సమయంలో అతనిలో ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా తగ్గిపోయింది. భయం అనేది పెరిగిపోయింది. నాకే ఎందుకు ఈ సమస్యలు అనే భావన ఎక్కువైంది. అందువల్లే అతనిలో ఆత్మహత్య అనే ఆలోచన వచ్చింది. హనుమంతుడు మాత్రమే కాదు.. మనలో చాలామందికి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. జీవితం అంటేనే పోరాటం.. ఆ పోరాటం పూర్తి స్థాయిలో చేస్తేనే జీవిత పరమార్ధం సాధించగలం. ఆ పోరాటాన్ని మధ్యలో విరమిస్తే వచ్చేవి ఆత్మహత్య తాలూకు ఆలోచనలే. అందుకే సమస్య ఎదురైనప్పుడు వై మీ అనుకోకుండా.. ట్రై మీ అని ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది. ప్రతికూల ఆలోచనల నుంచి విముక్తి సాధ్యమవుతుంది. అప్పుడు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు. సులభంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవితాన్ని కొనసాగించవచ్చు.

    ఏడు లక్షల మంది చనిపోతున్నారు

    ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 7 లక్షల మంది కంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఇలా చనిపోతున్న వారి సంఖ్య కరోనా మహమ్మారులు ప్రబలినప్పుడు కన్నుమూసే వారి కంటే ఎక్కువ. అయితే వీరిలో ఎక్కువ శాతం యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్నవారు జీవితానికి ఎండ్ కార్డు వేసుకోవడం ఆవేదనను కలిగిస్తోంది. ఈ ఆత్మహత్యలను నివారించేందుకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (IASP) ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2024 -26 సంవత్సరాలకు సంబంధించి “మాట్లాడటం మొదలు పెట్టు.. ఆత్మహత్య ఆలోచనలను కట్టిపెట్టు” అనే థీమ్ తో ప్రచారం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ 2003లో ఏర్పాటయింది. ఆత్మహత్య తాలూకు ఆలోచనలను ప్రజల నుంచి తొలగించేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. వివిధ దేశాలలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేకాదు ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇస్తోంది. వారికి మానసికపరమైన సమస్యలు ఉంటే.. ఆస్పత్రులలో చికిత్స అందించేందుకు సహకరిస్తోంది.. అంతేకాదు మానసిక రుగ్మతలతో బాధపడుతూ.. చనిపోవాలని ఆలోచనలు ఉన్నవారాకి చికిత్సను అందిస్తోంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.