Nepal Viral Video: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది.. ఇది భారత్‌లోని ఓ సెల్యులార్ కంపెనీ స్లోగన్.. ఈ స్లోగన్‌లాగానే ఒక్క వీడియో.. నేపాల్ భగ్గుమనేలా చేసింది. వారం రోజులుగా తగలబడడానికి కారణమైంది. సోషల్ మీడియా యాప్స్ నిషేధం విధించడం కారణంగానే దేశంలో ఆందోళనలు మొదలయ్యాయని అంతా భావిస్తున్నారు. యాప్స్‌ను పునరుద్ధరించాలని యువత ఆందోళన చేస్తున్నట్లు చాలా మంది భావించారు. కానీ, నేపాల్ తగత బడడానికి, ఉద్యమానికి ఓ వీడియో కారణం. నేపాల్‌లో యువత సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల ఆడంబర జీవనశైలిని బహిర్గతం చేస్తూ వైరల్ రీల్స్‌తో అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ రీల్స్ #PoliticiansNepoBabyNepal, #NepoKids హ్యాష్‌ట్యాగ్‌లతో టిక్‌టాక్, రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఉద్యమం విస్తరిస్తుండడంతో ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం విధించింది. దీంతో ప్రత్యక్ష నిరసనలు మొదలయ్యాయి. హింసాత్మక ఘర్షణలలో 22 మంది మరణించడంతో దేశవ్యాప్త సంక్షోభంగా మారింది.
‘నెపో కిడ్స్’ ఉద్యమం..
నేపాల్‌లో యువత, రాజకీయ నాయకుల పిల్లలు, ప్రభావవంతమైన వ్యక్తుల కుటుంబ సభ్యుల ఆడంబర జీవనశైలిని బహిర్గతం చేసే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు లూయీ విట్టన్, కార్టియర్ వంటి లగ్జరీ బ్రాండ్లతో కూడిన ఫొటోలు, ఖరీదైన కార్లు, విదేశీ సెలవులను ప్రదర్శిస్తూ, సామాన్య నేపాలీల జీవన గుండెచప్పుడుతో పోల్చి చూపిస్తున్నాయి. ఈ ‘నెపో కిడ్స్’ ట్రెండ్, రాజకీయ నాయకులు పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలను లేవనెత్తింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోపాల్ పరాజులీ కుమారుడు సయుజ్ పరాజులీ, మంత్రి బిందు కుమార్ థాపా కుమారుడు సౌగత్ థాపాలను ఉదహరిస్తూ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఉద్యమం, నేపాల్‌లో 20.8% యువ నిరుద్యోగ రేటు సంవత్సరానికి 1,400 డాలర్ల కన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్న సామాన్య ప్రజల అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది.
సోషల్ మీడియాపై నిషేధంతో నిరసనలు..
సెప్టెంబర్ 4న, నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ సహా 26 సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించింది. ఈ సంస్థలు నేపాల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో రిజిస్టర్ కాకపోవడమే కారణంగా. ఈ నిషేధం విధించినట్లు తెలిపింది. కానీ, అవినీతిపై నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా విమర్శకులు భావించారు. ఈ చర్య యువత ఆగ్రహాన్ని మరింత రెచ్చగొట్టి, ‘జెన్ జెడ్ నిరసనలు’గా పిలవబడే విస్తృత ఉద్యమానికి దారితీసింది. టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు, వీపీఎన్‌లను ఉపయోగించి, నిషేధాన్ని దాటవేసి, నిరసనలను సమన్వయం చేయడానికి యువతకు సహాయపడ్డాయి. ఈ నిషేధం, వాక్ స్వాతంత్య్రంపై దాడిగా అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఖండించాయి, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్టులు దీనిని పత్రికా స్వేచ్ఛకు ‘‘ప్రమాదకరమైన ఆనవాళు’’గా పేర్కొంది.
జెన్ జెడ్ నిరసనలు..
సెప్టెంబర్ 8న, కాఠ్మాండులోని మైతిఘర్ ప్రాంతంలో హమీ నేపాల్ అనే యువత నడిపిన స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనలు, సామాజిక మాధ్యమ నిషేధంతోపాటు, అవినీతి, అసమానతలు, రాజకీయ నాయకుల పిల్లల ఆడంబర జీవనశైలిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. నిరసనకారులు ‘‘అవినీతిని ఆపండి, సామాజిక మాధ్యమాలను కాదు’’, ‘‘యువత అవినీతికి వ్యతిరేకం’’ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలు హింసాత్మకంగా మారి, పార్లమెంట్ భవనంలోకి చొరబడిన నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, మరియు లైవ్ అమ్యూనిషన్‌ను ఉపయోగించారు, దీనివల్ల 19 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. ఈ ఘర్షణలు నేపాల్ ఆధునిక చరిత్రలో అత్యంత విస్తృతమైన నిరసనలుగా పరిగణించబడుతున్నాయి.
ప్రధానమంత్రి రాజీనామా..
నిరసనల తీవ్రత, పోలీసు హింసపై అంతర్జాతీయ ఖండనల నేపథ్యంలో, ప్రధానమంత్రి కేపీ.శర్మ ఓలీ సెప్టెంబర్ 9న రాజీనామా చేశారు. ఓలీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్) నాయకుడు, నిరసనలను ‘‘జాతీయ గౌరవం’’, ‘‘చట్ట నిర్వహణ’’ కోసం తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా చూస్తూ, యువతను స్వతంత్ర ఆలోచన లేనివారిగా విమర్శించారు. అయితే, నిరసనకారులు పార్లమెంట్ భవనం, సింఘ దర్బార్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఆక్రమించి, కొన్ని చోట్ల నిప్పు పెట్టడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది. హోం మంత్రి రమేష్ లేఖక్ కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అయినప్పటికీ, నిరసనకారులు స్థిరమైన రాజకీయ సంస్కరణలు, అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ స్థాపనను డిమాండ్ చేస్తున్నారు.
అసమానతల ఆగ్రహం..
నేపాల్‌లో ఆర్థిక అసమానతలు, అవినీతి యువత నిరసనలకు ప్రధాన కారణాలు. దేశ జీడీపీలో 33.1% విదేశాల్లో పనిచేసే నేపాలీల రెమిటెన్స్‌ల నుంచి వస్తుంది, అయితే యువ నిరుద్యోగం 20.8%గా ఉంది. సామాన్య నేపాలీలు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియాలో తక్కువ వేతన ఉద్యోగాల కోసం వలస వెళ్తుండగా, రాజకీయ నాయకుల పిల్లలు లగ్జరీ జీవనశైలిని ఆస్వాదిస్తున్నారనే ఆరోపణలు ఆగ్రహాన్ని రెట్టింపు చేశాయి. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకారం, నేపాల్ ఆసియాలో అత్యంత అవినీతి దేశాల్లో ఒకటిగా ఉంది. అసమానతలు, అవినీతి యువతను సామాజిక మాధ్యమాల ద్వారా తమ గొంతును వినిపించేలా ప్రేరేపించాయి.
Nepali youth caught their poltician&Familymembers rich lifestyle and flooded these kind of reel in social media … https://t.co/uUrrRcUkJy pic.twitter.com/D0cvPqL3Qh
— . (@single_soul1) September 9, 2025