US War On Venezuela: తాను శాంతికాముకుడిని అని.. అనేక యుద్ధాలు ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు స్వయంగా యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి దించేందుకు పావులు కదుపుతున్నాడు. తమ దేశంలోకి అక్రమంగా డ్ర*గ్స్ పరఫరా చేస్తున్నాడన్న కారణంలో ట్రంప్ వెనెజులా చుట్టూ పది ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్ జెట్లు మోహరించాడు. ఈ చర్యను డ్ర*గ్స్ కార్టెల్స్‌ను అణచివేసేందుకు తీసుకున్న దశగా అమెరికా చెబుతున్నప్పటికీ, దీని వెనుక రాజకీయ లక్ష్యాలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వెనెజుల నుంచి అమెరికాకు మాదక ద్రవ్యాల ప్రవాహానికి మదురోనే కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ అసలు లక్ష్యం వెనిజులలోని విశాలమైన చమురు సంపదను సొంతం చేసుకునే ఎత్తుగడగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
డ్ర*గ్స్ సరఫరా సాకుతో..
ట్రంప్ పరిపాలన వెనెజులాలోని ట్రెన్ డి అరాగువా వంటి డ్ర*గ్స్ కార్టెల్స్‌ను ‘నార్కో–టెర్రరిస్ట్‘ సంస్థలుగా పేర్కొంటూ, వాటిపై సైనిక దాడులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల, అమెరికా సైన్యం కరీబియన్ సముద్రంలో ఒక మాదకద్రవ్యాల బోటుపై దాడి చేసి, 11 మందిని చంపింది. ఈ బోటు ట్రెన్ డి అరాగువా గ్యాంగ్‌కు చెందినదని, అమెరికాకు మాదక ద్రవ్యాలను తరలిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని, మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తాయని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మదురో ఈ దాడులను ఖండించారు.
చమురు సంపదపై కన్ను..
వెనెజులా ప్రపంచంలో అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. ఈ సంపద దేశ ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా గతంలో వెనెజులాపై ఆర్థిక ఆంక్షలు విధించింది, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచింది. ట్రంప్ తాజా సైనిక చర్యలు, డ్రూగ్ కార్టెల్స్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వెనిజుల చమురు సంపదను కొల్లగొట్టడంలో ఒక వ్యూహంగా తెలుస్తోంది. వెనెజులా నాయకత్వం ఈ చర్యలను అమెరికా ‘సామ్రాజ్యవాద ఆధిపత్యం‘గా ఖండిస్తూ, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు 45 లక్షల మంది మిలిషియాను సిద్ధం చేస్తోంది. మదురో అమెరికా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దేశ రక్షణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ క్రమలో వెనిజుల యొక్క ఎఫ్–16 యుద్ధ విమానాలు అమెరికా నౌకాదళ యుద్ధనౌకపై ఎగిరాయి. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన..
ఇదిలా ఉంటే..అమెరికా సైనిక చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డ్ర*గ్ కార్టెల్స్‌పై దాడులు అమెరికా 2001 ఆథరైజేషన్ ఆఫ్ యూస్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్ (ఏయూఎంఎఫ్) కింద చట్టబద్ధమైనవి కావా అనే సందేహాలు ఉన్నాయి. నిపుణులు ఈ దాడులను ఖండిస్తున్నారు. ఇవి మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అమెరికా ఈ చర్యలు ఐక్యరాష్ట్ర సమితి చార్టర్‌ను ఉల్లంఘించవచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అమెరికా–వెనిజుల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో, ఈ సంక్షోభం ఒక పూర్తి స్థాయి సైనిక సంఘర్షణగా మారే అవకాశం ఉంది. మదురోను ఒత్తిడిలో ఉంచి, రాజకీయ మార్పును సాధించడమే లక్ష్యంగా ట్రంప్ పావులు కదుపుతున్నారు. కానీ ఇది లాటిన్ అమెరికాలో అస్థిరతను పెంచే ప్రమాదం ఉంది. వెనిజులా యొక్క చమురు సంపద, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఒత్తిడి ఈ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.