Che Guevara : ‘చే’గువేరా ఫోటో వెనుక అసలు కథ ఇదీ..

Che Guevara 1967, అక్టోబర్ 9న తనను కాల్చబోతున్న బొలీవియా సైనికుడితో ‘నువ్వు చంపుతున్నది ఒక మనిషిని మాత్రమే!’ అన్నాడు చే గువేరా. అతని మాటలు నిజం చేస్తూ అతను మరణించిన అర్ధ శతాబ్దం తర్వాత కూడా అతని సిద్ధాంతాలు, ఆశయాలు నేటికీ వినిపిస్తూనే, స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి.

Written By: NARESH, Updated On : June 14, 2024 10:07 pm

This is the real story behind the photo of Che Guevara.

Follow us on

Che Guevara : కమ్యూనిస్టు భావాలకు, సాయుధ విప్లవ పోరాటానికి పోస్టర్ బాయ్ ‘చే’గువేరా. అర్జెంటీనాలో సంపన్న కుటుంబంలో పుట్టిన ఆయన వైద్య శాస్త్రం అభ్యసించాడు. ఫిడెల్ కాస్ట్రోతో కలిసి క్యూబా విముక్తి కోసం సాయుధ పోరాటం చేశాడు. బొలీవియా దేశంలో సాయుధ పోరాటం చేస్తుండగా అమెరికా గూఢచారి సంస్థ సీఐఏతో కలిసి బొలీవియా సైన్యం అతనిపై దాడి చేసి చంపింది. చే చనిపోయే వరకు ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలే. ‘చే’గువేరా చెప్పగానే అందరికీ గుర్తొచ్చే రూపం ఆకుపచ్చ రంగు బెరెట్ టోపీలో పొడవాటి జుట్టుతో ఉన్న ఫొటో.

‘చే’ అభిమానులు, ఆయన సిద్ధాంతాలు నచ్చిన వారు అందరూ ఆ ఫొటోనే తమ ఇళ్లలో, ఆఫీసుల్లో, పాకెట్లలో, వాహనాలపై పెట్టుకున్నారు. ఇది ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయిందంటే ఎలాంటి సందేహం లేదు. ఆయన ఎవరు? ఏం చేశారు? అనేది తెలియని వారు కూడా ఆయన ఫొటో ప్రింట్ ఉన్న టీ షర్టులను ధరించడం ఆనవాయితీగా వచ్చింది.

ఆల్బర్టో కోడ్రా తీసిన ఫొటో..
1960, మార్చి 4న హవానాలోని ఓడరేవులో బెల్జియం నుంచి గ్రెనేడ్లు, తుపాకులు ఇతర ఆయుధాలతో వచ్చిన ఫ్రెంచ్ నౌక ‘లా కౌబ్రే’ నుంచి మందుగుండు సామగ్రి దించుతుండగా పేలుడు సంభవించి. ఇందులో 100కు పైగా మంది మరణించారు. విప్లవ పోరాటాన్ని నిర్వీర్యం చేయడానికి సీఐఏ పన్నిన కుట్ర అని ఫిడెల్ క్యాస్ట్రో దీన్ని విమర్శించాడు. మార్చి 5వ తేదీ మరణించిన వారి కోసం నిర్వహించిన సంతాప సభను కాస్ట్రోతో పాటు ఆయన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఆల్బర్టో కోడ్రా వచ్చారు. అక్కడి దృశ్యాలను కవర్ చేశాడు.

ఆల్బర్టో కోడ్రా లైకా కెమెరాలో కొడాక్ ఫిల్మ్ లోడ్ చేసి 10 మీటర్ల దూరం నుంచి ఆ ప్రదేశాలను ఫొటో తీస్తుండగా ఆవేశంగా స్పీచ్ ఇస్తున్న కాస్ట్రో వెనుక నిలుచొని ఉన్న ‘చే’గువేరా ఒక్కసారి ముందుకు వచ్చాడు. అతని మొహంలో ఆగ్రహం, కండ్లలో బాధ గమనించిన కోడ్రా కాస్ట్రోని వదిలి, ‘చే’ వైపు కెమెరాను తిప్పాడు. బాగా జూమ్ చేసి, షాట్ కంపోజ్ చేసి, రెండు ఫోటోలు తీశాడు.

రెవల్యూషన్ అనే పత్రికకు కోడ్రా ఫొటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. అయితే ఈ లా కౌబ్రే ఘటనకు సంబంధించి ఫొటోలను తమ పత్రికకు పంపించాడు. అందులో ఫిడెల్ క్యాస్ట్రో, చే ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. అయితే ఆ పత్రికా ఎడిటర్ మాత్రం కేవలం క్యాస్ట్రో ఫొటోలు వాడుకొని చే ఫొటోలు వెనక్కు పంపించారు. కోడ్రా ఆ ఫొటోలో చే కళ్లను చూసి ఇది మామూలు ఫొటో కాదని అనుకున్నాడు. ఒకవైపు ఉన్న చెట్టు ఆకును, మరోవైపు ఉన్న ఒక వ్యక్తి తలను తొలగించి (ఆ ఫొటోలో వచ్చినవి) ఫ్రేమ్ కట్టించి తన ఆఫీసులో వేలాడదీశాడు.

గెరిల్లెరో హీరోయికో
అల్బర్టో కోడ్రా ఆ ఫోటోకు గెరిల్లా హీరో అనే అర్థం వచ్చేలా ‘గెరిల్లెరో హీరోయికో’ అని స్పానిష్ భాషలో పేరు పెట్టారు. ఈ ఫోటోకు సంబంధించి కొన్ని ప్రింట్లు తన స్నేహితులకు పంపించాడు. అందులో ఒక స్నేహితుడు క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించే కొద్ది రోజుల ముందు నిర్వహించిన ఒక కాన్ఫరెన్స్ లో ఉపన్యాసం ఇచ్చే వారి జాబితాలో చే గువేరా పేరు పెట్టి ఒక పత్రికలో వచ్చిన ప్రకటనలో ఉపయోగించారు. అప్పుడే ఈ ఫొటోను ప్రపంచం మొత్తం చూసింది. బొలీవియాలో అక్టోబర్ 9, 1967న చే హత్య తర్వాత క్యాస్ట్రో అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ఈ ఫోటోను బాగా ఫేమస్ అయ్యింది.

10 లక్షల మంది హాజరైన ఆ బహిరంగ సభలో, గతంలో చే మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఐదంతస్తుల భవనంపై వేలాడదీశారు. బొలీవియా సాయుధ పోరాటం సమయంలో చేగువేరా రాసిన ‘బొలీవియన్’ ఇటలీకి చెందిన జియాన్ జియకోమో ఫెల్ట్రినెల్లి చేతికి చిక్కింది. అయితే దాన్ని పుస్తకంగా అచ్చు వేయాలనుకున్న జియకోమో కవర్ పేజీపై వేసేందుకు కోడ్రా దగ్గర చే ఫొటోను తీసుకున్నాడు.

బొలీవియన్ డైరీ పుస్తకం అచ్చు తర్వాత యూరప్ అంతా ‘చే’గువేరా ఫోటో విస్తరించింది. పెట్టుబడిదారులపై పోరాటం చేసే అందరికీ చేగువేరా బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. పారిస్ లో 1968లో జరిగిన విద్యార్థి ఉద్యమం నుంచి, 1988 ఐర్లాండ్ స్వాతంత్య్ర కోసం పోరాడిన సిన్ ఫెన్ సంస్థ అధ్యక్షుడు గెర్రీ ఆడమ్స్ వరకూ చేగువేరా పేరు, గెరిల్లా హీరో ఫోటో కరదీపికలుగా మారాయి. చేకు బద్ధశత్రువైన అమెరికా గోడలపై కూడా చేగువేరా పేరూ, ఫోటో కనిపించాయి.

స్కెచ్ రూపొందించిన ఫిట్జ్ పాట్రిక్
ఐర్లాండ్ చిత్రకారుడు జిమ్ ఫిట్జ్ పాట్రిక్ గెరిల్లా హీరో చిత్రాన్ని 1967లో ఎరుపు రంగు బ్యాక్ గ్రౌండ్ మీద నలుపు రంగు స్కెచ్ గా గీశాడు. ఆ తర్వాత పచ్చ బొట్టుగా, వాహనాలపై స్టిక్కర్లుగా, గోడలపై గ్రాఫిటీగా వచ్చింది. పెట్టుబడిదారులకు వ్యతిరేక పోరాటాలు, కమ్యూనిస్టు భావాలు, సాయుధ పోరాటాలకు ఈ చిత్రమే బ్రాండుగా మారింది.

1967, అక్టోబర్ 9న తనను కాల్చబోతున్న బొలీవియా సైనికుడితో ‘నువ్వు చంపుతున్నది ఒక మనిషిని మాత్రమే!’ అన్నాడు చే గువేరా. అతని మాటలు నిజం చేస్తూ అతను మరణించిన అర్ధ శతాబ్దం తర్వాత కూడా అతని సిద్ధాంతాలు, ఆశయాలు నేటికీ వినిపిస్తూనే, స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి.