Decrease Rupee Value: రూపాయి విలువ పడిపోతుంది. చరిత్రలో తొలిసారి మరింత దిగజారి డాలర్ మారకంతో పోలిస్తే 80 రూపాయలకు పడిపోయింది. జీవితకాల కనిష్ట రికార్డుగా నమోదు చేసింది. పతనం ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియదు. రూపాయి మారక విలువ పడిపోవడం వల్ల దేశీయంగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఫారెక్స్ నిల్వలు 580 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. గడిచిన వారంతో పోలిస్తే 8 మిలియన్ డాలర్లు తగ్గు ముఖం పట్టడం గమనార్హం. అసలు రూపాయి పాపాయి లాగా గుక్క పెట్టి ఏడవడానికి కారణాలు ఏంటి? రూపాయి పతనం ఇలాగే కొనసాగితే భారతదేశం ఎలాంటి సవాళ్ళను ఎదురుకోవాల్సి వస్తుందన్నది ఆందోళనగా మారింది.

-మన ఆర్థిక వ్యవస్థ డాలర్ పై ఆధారపడి ఉంది
భారత దేశ ఆర్థిక వ్యవస్థ డాలర్ పై ఆధారపడి ఉంది. మనం నెరిపే వాణిజ్య అవసరాలు, తీసుకొచ్చే అప్పులు డాలర్ విలువ ఆధారంగానే ఉంటాయి. అంతర్జాతీయ పరిణామాలు కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తాయి. కోవిడ్, రష్యా, ఉక్రేయిన్ యుద్ధం, చమురు ధరలు పెరగడం వంటి కారణాలు రూపాయి పతనాన్ని శాసిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడం వల్ల భారతదేశం అనేక ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మన దేశం ఎగుమతుల కంటే దిగుమతుల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నందున వచ్చే డాలర్ల కంటే చెల్లించాల్సిన డాలర్లు ఎక్కువ అవుతుండటంతో అది అంతిమంగా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడంతో విదేశీ వాణిజ్యలోటు ఫారిన్ ట్రేడ్ డెఫిసిట్( ఎగుమతి దిగుమతిల మధ్య అంతరం) ఏర్పడుతోంది. అలాగే వాస్తవ ఖాతా లోటు ( కరెంట్ అకౌంట్ డెఫిసిట్) కూడా రూపాయి మారకాన్ని ప్రభావితం చేస్తున్నది. దీని ప్రకారం కేవలం ఎగుమతి దిగుమతులే కాదు.. దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యం చెల్లిపుల మధ్య లోటు కూడా రూపాయి విలువను నిర్దేశిస్తుంది. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణం కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగింది. దీంతో అక్కడి ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. భారతదేశం తీసుకున్న రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ కూడా దీని కారణంగా పెరిగిపోయింది. దీంతో రూపాయి విలువ పడిపోయింది.
-విదేశీ పెట్టుబడులు స్థిరంగా ఉండాలి
మనదేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు స్థిరంగా ఉంటేనే డాలర్ విలువ కూడా స్థిరంగా ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లు, ఇతరత్రా రూపంలో పెట్టుబడులుగా వచ్చే డాలర్లకు స్థిరత్వం ఉండదు. ఇన్వెస్టర్లు తరచూ లాభాలు వస్తాయని అమ్మకాలు చేపట్టడం వల్ల రూపాయి స్థిరత్వాన్ని కోల్పోతోంది. రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారి ధరలు పెరుగుతాయి.. మనదేశానికి అవసరమైన పెట్రో ఉత్పత్తుల్లో 80% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. వాటికి చెల్లింపులు అన్ని డాలర్లలోనే చేయాల్సి ఉంటుంది. డాలర్ మారక విలువ పెరిగినందున.. మనం చెల్లించాల్సిన చెల్లింపులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆ ప్రభావం కరెంట్ అకౌంట్ పై పడుతుంది. దానిని పూడ్చుకునేందుకు ప్రభుత్వం అనివార్యంగా ధరలు పెంచుతుంది. దీనివల్ల పెట్రోల్ ఉత్పత్తులపై ఆధారపడిన ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. అది అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. దీనికి కళ్లెం వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరిస్తుంది. రూపాయి విలువ తగ్గడం డాలర్ విలువ పెరగడంతో విదేశీ కార్పోరేట్ రుణాలకు చెల్లించాల్సిన వడ్డీ పెరిగి ఇక్కడి మార్కెట్ల లాభాలపైన ప్రభావం పడుతుంది.
-మోడీ సార్ ఇప్పుడు ఏం చేస్తారు?
పక్కనున్న శ్రీలంకలో డాలర్ తో రూపాయి మారకం విలువ మూడు వందలు దాటి పరిగెడుతోంది. ఆర్థిక సంక్షోభంతో కుదేలైంది. పాకిస్తాన్ రేపో మాపో కూలడానికి సిద్ధమైంది.బంగ్లాదేశ్ పరిస్థితి తీసికట్టుగా మారింది. ప్రపంచంలోని పలు దేశాలు కునారిల్లుతున్నాయి. ఇప్పుడు భారత రూపాయి మారకం విలువ కూడా రూ.80కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. మాట్లాడితే పక్కదేశాల ఆర్థిక పరిస్థితిపై మాట్లాడే మోడీషాలు, బీజేపీ పెద్దలు ఇప్పుడు తీవ్ర ధరాఘాతంతో బాధపడుతున్న దేశ ప్రజలపై మరింత పన్నుల భారం మోపి వారి ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. శ్రీలంకలో ఎదురు తిరిగినట్టే భారత్ లో ఆ పరిస్థితులు రావడం కష్టమే అయినా..ఈ ధరాఘాతం చివరకు బీజేపీ ప్రభుత్వ పుట్టిముంచడం ఖాయంగా కనిపిస్తోంది. బడాయిలకు పోయి ప్రజలపై భారం మోపితే భారత్ పరిస్థితి కూడా లంకలా దహనం కావడం ఖాయం. పెరిగిపోతున్న ధరలను కంట్రోల్ చేసి.. ద్రవ్యోల్బణం కట్టడి చేసి దేశ ప్రజలను మోడీసార్ కాపాడుతారా? ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది.