Homeఅంతర్జాతీయంWoman dies in bus : ఎడారి బతుకులు.. కుటుంబం కోసం మస్కట్.. తిరిగి వస్తూ...

Woman dies in bus : ఎడారి బతుకులు.. కుటుంబం కోసం మస్కట్.. తిరిగి వస్తూ బస్సులోనే తనువు చాలించిన మహిళ!

Woman dies in bus : ఎడారి దేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నలిగిపోతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎరగా చూపి ఎడారి దేశాలకు పంపిస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం అక్కడ పని చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇదే అదునుగా దళారులు రంగ ప్రవేశం చేస్తున్నారు. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. అడ్డగోలు పనులు పెడుతున్నారు. అక్కడ యజమానులు పెట్టే ఇబ్బందులతో ఉండలేక.. స్వగ్రామానికి వచ్చే మార్గం లేక చాలామంది సతమతమవుతున్నారు. ఎడారుల్లో ఒంటెలకు, పశువుల సంరక్షణలో పనికి కుదురుతున్నారు. వేళకు తిండి ఉండదు. కంటి నిండా నిద్ర ఉండదు. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన విన్నపాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. చాలామందిని స్వస్థలాలకు తీసుకొచ్చింది. ఇటువంటి తరుణంలో మస్కట్లో ఆపసోపాలు పడిన ఓ మహిళ.. అతి కష్టం మీద స్వగ్రామానికి చేరుకునే ప్రయత్నం చేసింది. మస్కట్ నుంచి హైదరాబాద్ వచ్చింది. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో వస్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందింది. ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. నిరుపేద కుటుంబం కావడంతో భర్త సంపాదన ఒక్కటే సరిపోదని భావించి మస్కట్ వెళ్ళింది. అక్కడ అనారోగ్యానికి గురైంది. తిరుగు ప్రయాణంలో విగత జీవిగా మారింది. తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంత సత్యపద్మకు పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన ప్రభాకర్ తో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ప్రభాకర్ తెచ్చిన కూలీ సొమ్ము ఇల్లు గడవడానికి కూడా సరిపోవడం లేదు. దీంతో సత్య పద్మ విజయవాడకు చెందిన మహిళ ఏజెంట్ ను ఆశ్రయించింది. రెండేళ్ల కిందట రెండు లక్షల రూపాయలు చెల్లించి మస్కట్ వెళ్ళింది. అక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. కానీ ఆ ఇంటి యజమానుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంది. అనారోగ్యానికి గురైంది. ఇంటికి వెళ్ళిపోతానని గత ఆరు నెలలుగా కోరుతూ వచ్చింది. ఆమెను వెనక్కి పంపాలని భర్త కూడా ఎన్నోసార్లు ఏజెంట్ను కోరాడు. మరో రెండు లక్షల రూపాయలు చెల్లిస్తే కానీ పంపించమని చెప్పడంతో.. ఆ నగదును కూడా కట్టారు. మరో వారం రోజుల్లో తిరిగి వస్తుందనుకుంటే.. విగత జీవిగా తిరిగి రావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

* రెండు లక్షల రూపాయలు కట్టి
ఏజెంట్ డిమాండ్ మేరకు రెండు లక్షల రూపాయల నగదు కట్టారు. ఈనెల 30న ఆమెను పంపిస్తామని ఏజెంట్ బదులిచ్చారు. కానీ ఉన్నపలంగా ఆమెను పంపించేశారు. కనీసం సమాచారం ఇవ్వలేదు. అనారోగ్యానికి గురైనందునే పంపించేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 24న మస్కట్ నుంచి సత్య పద్మ హైదరాబాద్ వచ్చేశారు. అక్కడ నుంచి తణుకు కు ఆర్టీసీ బస్సు ఎక్కారు. మార్గమధ్యలో ఆమె గుండెపోటుకు గురయ్యారు. ప్రాణాలు వదిలారు. దీంతో విజయవాడ వచ్చిన తరువాత.. అదే రోజు సాయంత్రానికి ఆర్టీసీ అధికారులు ఫోన్ చేసి ఆమె చనిపోయినట్లు తెలిపారు.

* ఆరు నెలలుగా అనారోగ్యం
సత్య పద్మకు గత ఆరు నెలలుగా ఆరోగ్యం బాగోలేదు. ఇంటికి వెళ్ళిపోతానని ఆమె ప్రాధేయపడ్డారు. కానీ అక్కడ యజమానులు అంగీకరించలేదు. విజయవాడలోని మహిళా ఏజెంట్లు సంప్రదిస్తే ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఉన్నపలంగా ఆమెను తేవాలంటే డబ్బులు కట్టాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. అయితే తనకు ఆరోగ్యం క్షీణిస్తోందని సత్య పద్మ భర్తకు ఫోన్లో సమాచారం అందించింది. దీంతో ఆయన రెండు లక్షల రూపాయల అప్పుచేసి ఏజెంట్ కు కట్టారు. అయినా సరే భార్య విగత జీవిగా రావడానికి ప్రభాకర్ తట్టుకోలేకపోతున్నాడు. తల్లి మరణంతో ఇద్దరు పిల్లలు దిక్కులేని వారు అయ్యారు.

* ఎంతోమంది మహిళలకు ఇదే పరిస్థితి
ఎడారి బతుకుల్లో ఎంతోమంది మహిళలు చిక్కుకుంటున్నట్లు తెలుస్తోంది. రకరకాల ఉపాధి పనులని చెప్పి ఎడారి దేశాల్లో వ్యభిచారం చేయిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇళ్లల్లో పనులకు వెళ్లే వారికి లైంగిక వేధింపులు ఎదురవుతుంటాయి. అయితే పేదరికంతో అలమటించేవారు.. ఉపాధి పొంది నాలుగు డబ్బులు వెనకేసుకుంటామని విదేశాలకు వెళుతున్నారు. కానీ అక్కడ అనారోగ్య సమస్యలతో విషాదాంతంతో తనువు చాలిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో కొన్ని వేల మంది తెలుగు మహిళలు ఉపాధి, ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో కొద్దిమంది మాత్రమే సవ్యంగా ఉపాధి పొందగలుగుతున్నారు. మిగతావారు ఇబ్బందుల మధ్య పని చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular