Italy : ఈ ప్రపంచం ఎన్నో వింతలు విడ్డూరాలకు నిలయంగా ఉంది. మన దేశంలో కూడా ఇప్పటికీ మిస్టీరియస్ గా ఉన్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి ఎన్ని పరిశోధనలు చేసినా సరే ఇప్పటికీ వాస్తవాలు తెలియడం లేదు. కొన్ని ఆలయాలు కూడా అంతుచిక్కని రహస్యాలతో కొలువుదీరాయి. అయితే మీలో దయ్యాలు ఉన్నాయని ఎంత మంది నమ్ముతున్నారు. ఓ స్త్రీ రేపు రా అంటూ గోడల మీద మీలో ఎంత మంది రాశారు? అంటే మీరు దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నట్టే. అది సరే ఏదైనా ప్రాంతంలో దయ్యాలు ఉన్నాయని చెబితే ఆ వైపు వెళ్లే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? చేయరు కదా. కానీ ఓ ఊరి మొత్తం దయ్యాలే ఉన్నాయి అంటే? ఆ ఊరికి వెళ్తారా? వెళ్తాం ఆ ఊరిలో ప్రజలు ఉంటారు కదా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. అవునండి ఆ ఊరు మొత్తం దయ్యాలే. ఆ ఊరికి వెళ్తే తిరిగి రావడం కష్టమేనట. ఇంతకీ ఆ గ్రామం ఏంటి? ఎందుకే ఇలా మారింది అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కాదండోయ్ ఏకంగా 60 సంవత్సరాల నుంచి ఆ ఊరిలో ఒక్కరు కూడా నివసించడం లేదు. అక్కడికి వెళ్లాలంటేనే వణుకుతుంటారు. ఫుల్ భయం. అక్కడ నివసించాలంటే గట్స్ ఉండాలి అనుకుంటున్నారా? అయినా సరే ఉండలేరట. వాస్తవం చెప్పాలంటే అదొక శాపగ్రస్త గ్రామం అంటారు. మధ్యయుగాల సమయంలో ఆ ఊరి పేరు క్రాకో అని పిలిచేవారట. ఇది ఇటలీలోని బాజిలికా అనే ప్రాంతంలో ఉంది. కేవోన్ నది సమీపంలో ఎత్తయిన కొండ మీద ఈ గ్రామాన్ని నిర్మించారు. అయితే దీన్ని శతాబ్దాల కిందట కట్టుదిట్టంగా నిర్మించారు. రక్షణ కోసం దీనిని శత్రుదుర్భేద్యంగా ఈ ఊరిని నిర్మించారట. బండను తొలిచి ఊరిలోని ఇళ్లను నిర్మించుకున్నారు. అంతేకాదు ప్రార్థన స్థలాలను కూడా పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. కొన్నిచోట్ల గుహల్లో కూడా ఇండ్లు కట్టుకున్నారు అప్పటి ప్రజలు. అయితే ఇది అప్పుడు ‘కేవ్ సిటీ’గా పేరు కూడా కాంచింది.
రోమన్ చక్రవర్తి రెండో ఫ్రెడరిక్ కాలంలో ఈ గ్రామాన్ని సైనిక స్థావరంగా వినియోగించారట. తర్వాత పద్నాలుగో శతాబ్దంలో ప్లేగు వ్యాధితో వందలాది మంది ప్రజలు మరణించారట. అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక ప్రమాదం రావడం, ప్రజలు చనిపోవడం కామన్ గా జరుగుతుందట. దీంతో ప్రజలు దీన్నొక శాపగ్రస్త గ్రామంగా భావించారు. తర్వాత బందిపోట్ల దాడుల్లో గ్రామస్తులు కొందరు చనిపోయారు. కొండచరియలు కూలిన సంఘటనల్లో మరికొందరు మరణించారు. చివరిసారిగా 1963లో ఒక భారీ కొండచరియ విరిగిపడింది. దీంతో ఆ ఊరిలో భారీ విధ్వంసమే జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి ముంచుకొని వస్తున్న ఈ ఉపద్రువాల వల్ల మిగిలిన కొద్ది మంది జనాలు కూడా ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అప్పట్నుంచి దీన్ని దెయ్యాల గ్రామంగా పిలుస్తున్నారు. కానీ ఇప్పుడిది పర్యాటక ఆకర్షణగా మారింది. ఇటలీ వచ్చే పర్యాటకుల్లో పలువురు ఈ ఊరిని ఆసక్తిగా చూడటానికి వెళ్తుంటారు. 2008లో జేమ్స్ బాండ్ సిరీస్‌లో భాగంగా క్వాంటమ్ ఆఫ్ సొలేస్ కోసం ఈ గ్రామంలో షూటింగ్ చేశారు. అప్పటి నుంచి ఫుల్ పాపులర్ అయింది ఈ ఊరు.