https://oktelugu.com/

Japan : అయితే డాక్టర్.. లేకుంటే ఇంజనీర్.. మన చదువులు ఇంతకుమించి ఎదగవు గాని.. ఒకసారి జపాన్ ఏం చేస్తుందో తెలుసుకుందామా?

జపాన్.. ఆసియాలో ప్రముఖమైన దేశం. భారత్ తో పోలిస్తే విస్తీర్ణపరంగా, జనాభాపరంగా చిన్న దేశం. అయితేనేం టెక్నాలజీలో నెంబర్ వన్. ఆర్థిక అభివృద్ధిలో మెరుగైన స్థానం. సంతోష సూచీలో, సగటు ఆయుర్దాయం, కష్టించి పని చేసే స్వభావం.. ఇలా అన్నిట్లో భారత్ కంటే జపాన్ ముందు వరుసలోనే ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 22, 2024 / 01:14 AM IST

    Japan Education System

    Follow us on

    Japan :  ఆసియా దేశాలలో జపాన్ తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడి ప్రజలు కష్టించి పని చేస్తారు. త్వరగా మేల్కొంటారు. త్వరగా పడుకుంటారు.. అయితే చదువు విషయంలోనూ జపాన్ దేశస్తులు ప్రత్యేకతను కొనసాగిస్తుంటారు. అర్థవంతమైన చదువులను తమ భావితరాలకు అందిస్తుంటారు. అందువల్లే పేటెంట్ హక్కుల విషయంలో జపాన్ భారత్ కంటే ముందుంటుంది. ఇప్పటికే అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన ప్రయోగాలు జరుగుతున్నాయి.. ప్రస్తుత తరాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మళ్ళించడంలో జపాన్ పాలకులు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. మార్కులు, ర్యాంకులు, బట్టి బట్టే విధానానికి స్వస్తి పలికారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థులు చదువుకునే విధంగా పరిస్థితులను కల్పిస్తున్నారు. వారి మెదళ్లపై ఒత్తిడి కలగకుండా.. మనసు ఇబ్బంది పడకుండా.. జాగ్రత్తగా పాఠాలు చెబుతున్నారు. అవి వారి వ్యక్తిత్వ వికాసానికి.. దేశాభివృద్ధికి తోడ్పడేలా చేస్తున్నారు..

    పరీక్షలు లేవు, గ్రేడ్స్ అంతకన్నా లేవు..

    మనదేశంలో విద్య అనేది ఒక వ్యాపారం. ఇలా రాయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మొహమాటం అంతకన్నా లేదు. హైదరాబాదులో పేరుపొందిన ఓ ప్రైవేట్ స్కూల్ ఎల్కేజీ స్థాయిలోనే దాదాపు లక్ష 40 వేల వరకు ఫీజు వసూలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల ఓ నెటిజిన్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమంలో సంచలనంగా మారింది. డబ్బును బట్టి విద్య లభిస్తోంది కాబట్టి.. దేశంలో చదువుకునే విషయంలోనూ అంతరాలు కొనసాగుతున్నాయి. అయితే జపాన్లో అలా ఉండదు. ఎవరైనా సరే చదువుకోవచ్చు. అక్కడ చదువుకోడానికి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పైగా అక్కడ విద్యా విధానాన్ని నిరంతరం ప్రభుత్వం పర్యవేక్షిస్తూ ఉంటుంది. విద్యను కొనుక్కోవడాన్ని నిరోధిస్తూ ఉంటుంది. ఇక అక్కడ చిన్నారులకు స్కూల్లో చేరిన మొదటి మూడు సంవత్సరాలు ఎటువంటి పరీక్షలు ఉండవు. గ్రేడ్స్ కూడా ఉండదు. కేవలం మర్యాదలు మాత్రమే నేర్పిస్తారు. గౌరవంగా ఎలా ఉండాలో చూపిస్తారు. ఉదారత అలవడేలా చేస్తారు. ప్రకృతి పట్ల దయగా ఎలా ఉండాలో వివరిస్తారు. అందువల్లే జపాన్ పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. మూడు సంవత్సరాల అనంతరం వారికి అసలైన సిలబస్ మొదలవుతుంది. అందులో చదవడం, రాయడం కంటే నేర్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుంది. క్షేత్రస్థాయి విద్యాబోధనను ఎక్కువగా చేపడుతుంది. అందువల్లే జపాన్ పిల్లలు మేధోపరంగా ఒక మెట్టు పైన ఉంటారు. మనం మాత్రం పిల్లల్ని డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని ముందుగానే నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ దిశగానే వారిని చదివిస్తున్నాం. అంతేతప్ప వారిలో మేథో వికాసాన్ని తట్టి లేపే ప్రయత్నాన్ని మాత్రం చేయడం లేదు.